ఇక ఆన్లైన్లో లో అయ్యప్పస్వామి ప్రసాదం:
కోవిడ్-19 కారణంగా ఈ సీజన్లో(మండల,మకరవిలక్కు) శబరిమల లో తగ్గనున్న ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించింది.
కరోనా మహమ్మారి కారణంగా శబరిమలలో పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనానికి అనుమతించిన బోర్డు,తద్వారా ఏర్పడే ఆర్థిక లోటుపాట్లను పూడ్చుకోవడంతో పాటు శబరిమలకు రాలేని భక్తులకు ప్రసాదాన్ని అందించేందుకు సరికొత్త ప్రణాళికకు రూపకల్పన చేసింది.
అందులో భాగంగా అయ్యప్పస్వామి భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదాన్ని (అరవణ పాయసం) కావాలనుకున్న భక్తులకు ఇంటికే తెచ్చిఅందించే కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది.
శబరిమల ఆలయ ఆదాయంతోనే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు,దాని పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న 3500 పైగా ఉద్యోగులకు జీతాలు అందిస్తుంది.
గత సంవత్సరం శబరిమల ఆదాయం 263.53 కోట్లు కాగా,దానిలో 60 శాతం ఆదాయం కేవలం అరవణ ప్రసాదం అమ్మకాలతోనే రావడం విశేషం.ఈ సంవత్సరం భక్తులు పరిమితంగా రానుండటంతో, ఆదాయం సంక్షోభంలో పడనున్న సంకేతాలతో,TDB ప్రసాదాల విక్రయాల ప్రాముఖ్యతను గుర్తించి ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేసేందుకు నిర్ణయించింది.
అయ్యప్పస్వామి ప్రసాదం కావాలనుకున్న భక్తులు ఆన్లైన్లో Rs.450 తో ఆర్డర్ చేస్తే,తపాలా శాఖ ద్వారా స్వామివారి ప్రసాదాన్ని వారి ఇంటికే పంపే ఏర్పాట్లను ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ చేపట్టింది.
ఈ ఆర్డర్లో అరవణ ప్రసాదం(డబ్బా)తో పాటుగా పవిత్ర విభూది, గంధం, పసుపు,పూలతో కూడిన కిట్ ను భక్తులు పొందవచ్చు.
ఈ ఆన్లైన్ ప్రసాద విక్రయాల ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామని, ప్రసాదాల హోమ్ డెలివరీ లకు అవసరమైన ప్యాకింగ్ ను మొదలుపెట్టామని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ N.వాసు తెలిపారు.
ఆన్లైన్ ప్రసాదాల అమ్మకాలు మండలపూజ మొదటి రోజైన నవంబర్16 న మొదలవుతుందని..,కేరళలో ఆర్డర్ చేసిన రెండు రోజులలో స్వామివారి ప్రసాదాన్ని డెలివరీ చేస్తామని, దేశవ్యాప్తంగా గరిష్టంగా వారం రోజులలో డెలివరీ చేస్తామని ఆయన తెలిపారు.
????️ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప????️