Sri Ganesha Vrata Kalpam Part 4|
॥ శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (4) ॥
మున్ను నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను.
గజాసుర వృత్తాంతం –
పూర్వము గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్ప, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై వరంబు కోరుమన, గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి కాపాడుచుండు”డని కోరగా భక్తసులభుండగు నా మహేశ్వరుండాతని కోర్కెదీర్ప గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుగ నుండె.
కైలాసమున పార్వతీదేవి భర్తజాడ దెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంతకాలంబునకు గజాసురగర్భస్థుడగుట తెలిసి రప్పించుకొనుమార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతివృత్తాంతమును దెలిపి, “యో మహానుభావ! పూర్వము భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నాకొసంగితివి. ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు” మని విలపింప హరి యాపార్వతీదేవి నూరడించి కైలాసంబున నుండుమని దెల్పి యంత నా హరియు బ్రహ్మాదిదేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి, పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగ నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరిని విచిత్ర వాద్యముల ధరింపచేసి తానును చిరుగంటలు, సన్నాయిని తాల్చి గజాసురపురంబు జొచ్చి అందందు జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుండు విని, వారలబిలిపించి తన భవనము నెదుట నాడించ నియమించగా బ్రహ్మాదిదేవతలు తమవాద్యవిశేషంబులు భోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్రవిచిత్రగతుల గంగిరెద్దు నాడించగా గజాసురుండు పరమానందభరితుడై “మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకువచ్చె గాన శివునొసంగు” మని పల్కె. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుండగు శ్రీహరిగా నెరింగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని దలచి “నా శిరస్సు త్రిలోకపూజ్యముగ చేసి, నాచర్మమును నీవు ధరింపవే”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి తన అంగీకారము
దెలుప నాతండు నందిని ప్రేరేపించె. నందియు తన శృంగమ్ములచే గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండు గజాసుర గర్భమునుండి వెలువడివచ్చి విష్ణుమూర్తిని స్తుతించె. అంత నా హరియు “దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు”నని యుపదేశించి ఈశ్వరుని, బ్రహ్మాది దేవతలను వీడ్కోలిపి, తాను వైకుంఠమ్మున కెరిగె. అంత శివుండును నందినెక్కి కైలాసంబున కతివేగంబుగ జనియె.
వినాయకోత్పత్తి –
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదులవలన విని ముదమంది, అభ్యంజనస్నానమాచరించుచు నలుగుబిండి నొక బాలునిగజేసి, ప్రాణంబొసంగి, వాకిలిద్వారమున కావలియుంచి, పార్వతి స్నానమాడి, సర్వాభరణములనలంకరించుకొనుచు పత్యాగమునమును నిరీక్షించుచుండె. అంత పరమేశ్వరుండు కైలాసమందిరమునకు వచ్చి, నందినవరోహించి లోనికిపోబోవ వాకిలిద్వారమందున్న బాలకుడడ్డగింప, కోపావేశుండై త్రిశూలంబుచే బాలకుని కంఠంబుదునిమి లోనికేగె.
అంత పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులపూజించె; నంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా, అంత నమ్మహేశ్వరుండు తానొనరించినపనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నాబాలుని కతికించి ప్రాణంబొసంగి ’గజానను’డను నామంబొసంగి యాతని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండె. గజాననుండును సులభముగ నెక్కితిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను వాహనముగా చేసికొనియె.
కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జనియించె. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతి గాంచియుండెను.
విఘ్నేశాధిపత్యము –
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబునకేగి పరమేశ్వరుని సేవించి, విఘ్నముల కొక్కని అధిపతిగా తమకొసంగుమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడనుగనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు; గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గాన ఇయ్యాధిపత్యంబు తన కొసంగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత నక్కుమారులజూచి “మీలో నెవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నెవరు నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యంబొసంగుదు”నని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలివాహనమెక్కి వాయువేగంబుననేగె.
అంత గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి “అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లాతీయదగునే? మీపాదసేవకుండను. నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి రక్షింపవే” యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం! గంగాదిసరస్వతీర్ధేషు స్నాతో భవతి పుత్రక.” “కుమారా! ఒకసారి నారాయణమంత్రమును బఠించిన మాత్రమున మూడువందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమొనర్చినవాడగును” అని సక్రమముగ నారాయణమంత్రంబుపదేశింప, గజాననుడు నత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసమ్మునుండె.
అమ్మంత్రప్రభావంబున అంతకు పూర్వము గంగా నదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నది లో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోగూడ నటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబునకేగి యచటగూడ తండ్రిసమీపమందున్న గజాననుని గాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుడు. తమ నిర్ణయంబు ననుసరించి యీ ఆధిపత్యము అన్నగారికే యొసగు” మని ప్రార్థించె.
అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థీనాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు, మొదలుగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహమునకొసంగియు, కొన్ని చేతధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబునకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమికందవయ్యె. బలవంతముగ చేతులానింప చరణంబు లాకసంబుజూచె. ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటముగ నవ్వె. నంత ’రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు’ నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లెడల దొర్లె. నతండును మృతుండయ్యె.
అంత పార్వతి శోకించుచు చంద్రుని జూచి, “పాపాత్ముడా! నీదృష్టి తగిలి నా కుమారుడు మరణించెగాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నిరాపనింద నొందుదురుగాక” యని శపించెను.
ఋషిపత్నులు నిరాపనింద కలుగుట –
ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబుచేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబుసేయ, ఋషులద్దానిం గనుంగొని అగ్నిదేవునితో నున్నవారు తమభార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నిరాపనింద కలిగినది. దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబుదాల్చి వచ్చుట దెల్పి సప్తమహర్షులను సమాధానపరచి వారితోగూడ బ్రహ్మ కైలాసంబునకేతెంచి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు “ఓ దేవీ! పార్వతీ! నీవొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడువాటిల్లెగాన దాని నుపసంగరింపు”మని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయె కుమారునిజేరదీసి, ముద్దాడి “ఏదినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వె నాదినంబున చంద్రుని జూడరాదు” అని శాపావకాశం బొసంగె. అంత బ్రహ్మాదిదేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థీయందు మాత్రము చంద్రునింజూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచె.
శమంతకోపాఖ్యానము –
ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు “స్వామీ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయకచతుర్థిగాన పార్వతీశాపంబుచే చంద్రునిం జూడరాదుగనుక నిజగృహంబుకేగెద సెలవిండు” అని పూర్వవృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికి దెల్పి నారదుడు స్వర్గలోకొబునకేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుననెవ్వరు చూడరాదని పట్టణమున చాటింపించెను. నాటిరాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను మింటివంక చూడక గోష్ఠమునకుబోయి పాలుపితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి “ఆహా! ఇక నాకెట్టి యపనింద రానున్నదో” యని సంశయమున నుండెను.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్ధమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద జేసి ఆ మణిని మన రాజుకిమ్మని యడిగిన, అతడు “ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిదీ మణి. ఎంతటి యాప్తునకే మందమతైననిచ్చునా” యని పలికిన పోనిమ్మని కృష్ణుడూరకుండెను. అంత నొకనాడా సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుండా శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికిజన నొక సింహ మా మణిని మాంసఖండమని భ్రమించి వానిని జంపి యా మణిని గొనిపోవుచుండ, నొక భల్లూక మా సింహమును దునిమి యా మణింగొని తన కొండబిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెకు ఆటవస్తువుగ నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని “కృష్ణుండు మణి యివ్వలేదను కారణమున నా సోదరుని జంపి రత్న మపహరించె” నని పట్టణమున చాటె. అది కృష్ణుండు విని “ఆహా! నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోషఫలం బిటుల కలిగిన” దని యెంచి దానిం బాపుకొన బంధుజన సేనాసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా నొక్కచో ప్రసేన మృతి కళేబరంబును, సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను.
ఆ దారింబట్టి పోవుచుండ నొక పర్వతగుహలోని కీ చిహ్నములు గాన్పింప నంత గుహద్వారమువద్ద పర్వారమ్మునుంచి, కృష్ణుండు గుహలోపలకేగి అచట మిరుమిట్లుగొల్పుచు బాలిక ఊయెల పై కట్టబడియున్న మణింజూచి అచ్చటకు మెల్లనజని ఆ మణిని చేతపుచ్చుకుని వచ్చునంత ఊయలలోని బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియును వింతమానిషి వచ్చెననుచు కేకలు వేయ నది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై, చనుదెంచి శ్రీకృష్ణునిపైబడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరలు గొరకుచు, ఘోరముగ యుద్ధముచేయ, కృష్ణుండును వానిం బడద్రోసి, వృక్షంబులచేతను, రాళ్ళచేతను, తుదకు ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్ళు యెడతెగక యిరువదెనిమిది దినములు యుద్ధమొనర్ప, జాంబవంతుడు క్షీణబలుండై, దేహంబెల్ల నొచ్చి భీతిచెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను
పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి; ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొరుమని ఆజ్ఞ యొసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు జేయవలెనని కోరుకొంటిని. కాలాంతరమున నిది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు నిటనుండ నిపుడు తము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరంబంతయు శిథిలమయ్యెను ప్రాణములుకడబెట్టె. జీవితేచ్ఛనశించె. నా అపరాధములు క్షమించి కాపాడుము నీకన్న వేరుదిక్కులేదు” అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయముంబాపి “భల్లుకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపైనారోపించిన అపనింద బాపుకొనుటకిటువచ్చితి గాన మణినొసంగిన నేనేగెద” నని జాంబవంతునకు దెల్పనతడు శ్రీకృష్ణునకు మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగి రక్షింపవేడ నాతని కభయమొసంగి, కృష్ణుడు గుహవెల్వడి తన యాలస్యమునకు పరితపించు బంధు మిత్ర సైన్యంబుల కానందంబు కలిగించి కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరే.
సభాస్థలికి పిన్న పెద్దలను జేర్చి సత్రాజిత్తును రావించి యావద్వృత్తాంతమును దెల్పి యాతనికి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు “అయ్యో! పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి” నని చాల విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను. అంత శ్రీకృష్ణుండును, సత్యభామను గైకొని సంతోషించి “ఇతర మణులేల? మాకు భామామణి చాలును. సూర్యవరప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే యుంచుకొనుము. మాకు వలదు” అనుచు మణిని సత్రాజిత్తునకొసంగి యాదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనక నిరాపనింద బాపుకొంటిరి. మా కేమిగతి”యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపదశుద్ధ చతుర్థిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యె నేని ఆనాడూ గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నిరాపనింద నొందకుండెదరు గాక” అని ఆనతీయ దేవాదులు “అనుగ్రహించబడితి” మని ఆనందించుచు తమ తమ నివాసములకేగి ప్రతి సంవత్సరమున భాద్రపదశుద్ధ చతుర్థీ యందు దేవతలు, మహర్షులు, మానవులు మున్నగువారందరు తమ తమ విభవములకొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి గాంచుచు సుఖముగ నుండిరని శాపమోక్ష ప్రకారము శౌనకాదిమునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె.
గమనిక –
చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.
సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః ||
సర్వేజనాస్సుఖినోభవంతు. in Telugu:
Also Read:
Sri Vinayaka Vrata Kalpam Part 1
Sri Vinayaka Vrata Kalpam Part 2
Sri Vinayaka Vrata Kalpam Part 3
Sri Vinayaka Vrata Kalpam Part 4