గాజుల గౌరమ్మ:
దేవీ నవరాత్రులలో రోజుకో రూపంలో దర్శనమిచ్చే కనకదుర్గమ్మను, ప్రత్యేక సందర్భాలలో అచ్చంగా పువ్వులు పండ్లు కూరగాయలతో అలంకరిస్తుంటారు. కార్తీక శుద్ధ విదియనాడు ఆ జగన్మాతకు చేసే గాజులు అలంకారమూ అలాంటిదే. ఆ రోజున తన సోదరి ఇంటికి వెళ్ళిన యమధర్మరాజు ఆమె ప్రేమతో పెట్టిన మృష్టాన్న భోజనానికి సంతుష్టుడై. ఏదైనా వరం కోరుకోమన్నాడట. తన సౌభాగ్య మైన పసుపూ కుంకుమా గాజులు ఎల్లకాలం నిలిచేలా వరం ఇవ్వమని ఆమె కోరుకోగా. ఆయన తధాస్తు అన్నట్లు పురాణ కథనం. అందుకే అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు పసుపు కుంకుమలతో పాటు గాజులను ప్రసాదంగా ఇస్తారు. విశేషించి దీపావళి వెళ్ళిన రెండో రోజున అమ్మవారిని లక్షలాది గాజులతో అలంకరించి ప్రసాదంగా పంచుతారు. అలా, బెజవాడ కనకదుర్గమ్మ తో బాటు దేశంలోని మరికొన్ని ప్రసిద్ధ ఆలయాలలోనూ రంగురంగుల గాజులు అలంకారం శోభాయమానంగా కొలువుదీరిన జగన్మాత రూపాలివి.