తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓడు ప్రసాదం సమర్పిస్తారు. పగిలిన కుండలో ప్రసాదం సమర్పించడానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకోండి.
శ్రీవారికి నిత్యం అనేక రకాలైన పిండి వంటలు., అన్నప్రసాదం, తీపి పదార్థాలతో కూడిన నైవేద్యం సమర్పిస్తారు. ఒక్కో నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో నివేదించడం అనవాయితీ. పులిహోర, చక్కెరపొంగల్, మలహోరా, మిరియాల ప్రసాదం, నేయ్ పొంగల్, జిలేబి, మురుకు, లడ్డూ, వడ, పాయసం, బొబ్బట్లు (పోలీలు) ఇలా అనేక ప్రసాదాలు విశేష దినాల్లోనూ…. ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం నివేదన చేయడం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు.
నిత్యా ప్రసాదాల్లో అన్నప్రసాదాలు ఉంటాయి. ఎన్ని గంగళాలు ప్రసాదం ఉన్న….ఆ ఒక్క ప్రసాదమే కులశేఖర పడి దాటి శ్రీవారికి నివేదిస్తారు. అసలు ఆ ప్రసాదం ఏంటి…?? ఆ ప్రసాదాన్ని ఓడు ప్రసాదంగా ఎందుకు పిలుస్తారు..??
ఓడు అంటే పగిలిన మట్టి కుండా అని అర్థం. అసలు పగిలిన కుండలో శ్రీవారికి ఎందుకు ప్రసాదం సమర్పిస్తారో తెలియాలంటే ముందు తొండమాన్ చక్రవర్తి గురించి తెలుసుకోవాలి. తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి ప్రియా భక్తుడు… శ్రీ వేంకటేశ్వరునికి చిన్న మామగారు. అపారమైన గర్వ భక్తి చూపించేవాడు తొండమాన్ చక్రవర్తి.
గర్వం అంటే ఇక్కడ తనకు మించిన భక్తుడు లేడనే భావన అని అర్థం. స్వామి వారికీ నిత్యం బంగారు పుష్పలతో అర్చన చేసే వాడు. తనలా బంగారు పుష్పలతో అర్చన చేసే వాడే లేదంటూ గర్విగా ఉండేవాడు. అలాంటి సమయంలోనే స్వామి వారి పాదాల చెంత మట్టి పుష్పలు కనిపిస్తాయి. అయితే మంత్రిని తొండమాన్ చక్రవర్తి మట్టి పుష్పలు ఎలా వచ్చాయని ఆవేశంగా అడుగుతాడు.
అదే సమయంలో ఆ మట్టి పుష్పలు ఎలా వచ్చాయో తెలియాలని చెప్తాడు. అయితే శ్రీవేంకటేశ్వరుడే తొండమాన్ కు ఆ మట్టి పుష్పలు ఎలా వచ్చాయో చెపుతారు. పూర్వం కుమ్మరి తోపులో కుమ్మరి దాసుడు ఉండే వాడు. స్వామి వారి పై అచెంచలమైన భక్తి కలిగినవాడు కుమ్మరి దాసుడు. నిత్యం శ్రీవారి కైంకర్యాలు కొరకు కుండలను అందించేవాడు. బంగారు పూలను అర్చించే శక్తి లేని ఆ కుమ్మరి దాసు ఇంటి వద్దనే మట్టిపూలతో స్వామి వారిని అర్చించే వాడు.
కుమ్మరిదాసు ఇంటివద్ద అర్చించే పుస్పాలు శ్రీవారి గర్భాలయంలోని స్వామి వారి పాదాల వద్ద వెలసేవట. అనంతరం శ్రీవారు తొండమాను చక్రవర్తితో కుమ్మరి దాసు నీకన్నా గొప్ప భక్తుడు…. ఆ కుమ్మరిదాసు తాయారు చేసే ఓడులోనే ప్రసాదం స్వీకరిస్తానని చెప్పారట శ్రీవారు. అలా ఓ కుండను తీసుకోని మీద భాగం వరకు పగులగొట్టి… క్రింది భాగంలో ఆకూ వేసి ప్రసాదాలు వడ్డించి… కుండ మెడభాగాన్ని క్రింద ఉంచి నివేదన చేసే వారు
కాలక్రమేణా ఆ ఓడు తాయారు చేసే మిరాశీ వ్యవస్థ లేకపోవడం…. గంగాళాలు అందుబాటులోకి రావడంతో ఓడు వినియోగం తగ్గింది. కానీ నేటికీ శ్రీవారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని ఓడు ప్రసాదంగానే పిలుస్తారు.