Information

Puri Jagannath Rath Yatra

పురీ జగన్నాథ మహాక్షేత్రం ఒక పుణ్య స్థలం, విశ్వాస కేంద్రమే కాదు- అత్యంత ప్రాచీన చారిత్రక ప్రశస్తి కలిగిన వైభవ భూమి.

సముద్రతీరంలో శ్రీ జగన్నాథ బలభద్ర సుభద్రామూర్తుల భవ్య మందిరం నీలాచలమనే చిన్న కొండపై నెలకొని ఉంది. నీల మాధవుడిగా నారాయణుడు అనాదిగా ఇక్కడ వేంచేసి ఉన్నాడని స్కాందాది పురాణాల కథనం.

ఒకే నారాయణ స్వరూపం నాలుగు మూర్తులుగా వ్యక్తమైందని స్కాందపురాణ ‘పురుషోత్తమ ఖండం’ చెబుతోంది. దారు(కర్ర)వులతో ఏర్పడిన మూర్తులు గల ప్రసిద్ధక్షేత్రం ఇదొక్కటే. ఎన్నో ప్రత్యేక లక్షణాలు కలిగిన ఈ ఆలయ విధులన్నీ విలక్షణమైన ఆగమాలను అనుసరించి నిర్వహిస్తుంటారు.

జగన్నాథమూర్తి యందు పురుష సూక్త మంత్రాలతోపాటు శ్రీ నృసింహ అనుష్టుప్‌ మంత్రశక్తిని బ్రహ్మ ప్రతిష్ఠించాడని వ్యాసుడి వచనం. వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రంతో బలభద్రుడు ప్రతిష్ఠితుడయ్యాడని, దేవీ సూక్తులతో సుభద్రాదేవి స్థాపితమైందని పురాణం వివరించింది. ఈ ముగ్గురితోపాటు సుదర్శన మహామంత్రాలతో ప్రతిష్ఠ పొందిన సుదర్శనదేవుడి మూర్తి కూడా గర్భగృహంలో కొలువై ఉంటుంది.

పురుషోత్తమ క్షేత్రంగా పురాణ ఋషులు చెప్పిన ఈ క్షేత్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. పన్నెండేళ్లకోసారి విగ్రహాలను మార్చే ప్రక్రియే అద్భుతంగాను, మార్మికంగాను ఉంటుంది. ఏ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఇది.

అదే విధంగా ప్రసాద మహిమ మరొక వైశిష్ట్యం. ఇక్కడి అన్నం, శాకపాకాలు- అత్యంత పవిత్రమైనవి, మహిమ కలవని అనాది విశ్వాసాచారం.

ఆదిశంకరులు, జయదేవుడు, చైతన్య మహాప్రభువు వంటి మహాత్ములు ఈ క్షేత్రంలో స్వామిని తనివితీరా సేవించుకున్నారు. శంకరుడు భారతదేశపు తూర్పు పీఠాన్ని ఈ క్షేత్రంలో నెలకొల్పారు. ఇది ఋగ్వేద పీఠం. కృష్ణభక్తి సంప్రదాయ ప్రవర్తకుడు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్షేత్రంలోనే స్వామి దర్శన తాదాత్మ్యంలో లీనమై సిద్ధిని పొందారు.

వైశాఖ శుక్ల అష్టమినాడు పుష్యయోగంతో కూడిన గురువారం నాడు ఈ దేవతామూర్తుల ప్రతిష్ఠ జరిగిందని స్కాందం చెబుతోంది. రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియనుంచి పదిరోజులు జరిగే బ్రహ్మాండమైన మహోత్సవం.

నందిఘోష అనే జగన్నాథ రథం, తాళధ్వజ నామం గల బలభద్రుడి రథం, దేవదళన(దర్పదళన) పేరున్న సుభద్రా రథం- మూడింటికీ దేని ప్రత్యేకత దానిదే. నిర్మాణం పూర్తయ్యాక, రథాలపై వివిధ స్థానాల్లో వేర్వేరు దేవతా శక్తులను ఆవాహన చేస్తారు. ప్రత్యేక హవిస్సులతో హోమం చేసి, రథాలను శక్తిమంతం చేశాక, మూలమూర్తులను వైభవంగా తీసుకువచ్చి ఆరోహింపజేస్తారు.

అటుపై విశేష పూజల అనంతరం మహారాజ వీధిలో యాత్ర సాగుతుంది. దివ్య కోలాహలాలతో, సంగీత నృత్యోత్సవాలతో సాగే రథం గుండిచా మందిరానికి చేరాక, విగ్రహాలను దింపి ఆ మందిరంలో పదిరోజులు ప్రజా దర్శనార్థం ఉంచి, తిరుగు రథయాత్ర ద్వారా మళ్ళీ పూర్వ మందిరానికి తీసుకువస్తారు.

ప్రపంచంలోనే అరుదైన మహోత్సవంగా అభివర్ణించదగిన ఈ రథయాత్ర మన మహా సంస్కృతికి సంకేతం.