Sri Venkateswara Mangala Stotram Lyrics and Meaning in Telugu:
శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 1 ॥
తా. లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.
లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్. ॥ 2 ॥
తా. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 3 ॥
తా. శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వేంకటేశవ్రునకు మంగళమగు గాక.
సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్. ॥ 4 ॥
తా. సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. ॥ 5 ॥
తా. నిత్యుడు, దోషములు లేనివాడు, సత్య స్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామియు అగు శ్రీవేంకటేశ్వరునికి మంగళమగు గాక.
స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 6 ॥
తా. స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు,
సుస్వభావము కలవాడు నగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 7 ॥
తా. పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
కాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 8 ॥
తా. కాలతత్త్వమును గమనింపక, ఎల్లపుడును తన్ను చూచుచున్న జీవాత్మలకు తనివితీరని అమృతస్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. ॥ 9 ॥
తా. పురుషులందరికిని తన పాదములే శరణమని వారియెడల గల దయచే తఱచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః
ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్. ॥ 10 ॥
తా. దయ యనెడి అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింపజేసి జీవలోకమును చల్లపరచుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్. ॥ 11 ॥
తా. తాను ధరించిన పూలమాలలవలనను, నగల వలనను, వస్త్రములవలనను, ఆయుధములవలనను, ప్రకాశించు సుందర విగ్రహము కలవాడును, సమస్త బాధలను పోగొట్టువాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 12 ॥
తా. శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 13 ॥
తా. శ్రీమణవాళ మహర్షి యొక్క మనసునందును, సమస్త జీవరాసులయందును నివసించునట్టి శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక!
నమ శ్శ్రీవేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే
వాసుదేవాయ శాంతాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 14 ॥
తా. శుద్ధజ్ఞాన స్వరూపుడు, శాంతుడు, వాసుదేవుడు శ్రీ కి నివాసస్థానమైన శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.
మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్. ॥ 15 ॥
తా. మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులును ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగు గాక.
Also Read :
Sri Venkatesa Mangalasasanam Lyrics in Hindi | English | Bengali | Kannada | Malayalam | Telugu | Tamil