సుప్రభాతంలో విభాగాలు
సుప్రభాతాన్ని బంగారువాకిలి ఎదురుగా “తిరుమామణి మంటపం”లో పఠిస్తారు. ఈ సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి.
వెంకటేశ్వర సుప్రభాతం: దేవునికి మేలుకొలుపు : 29 శ్లోకాలు – ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది.
వెంకటేశ్వర స్తోత్రం: భగవంతుని కీర్తన : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి: భగవంతునికి శరణాగతి: 16 శ్లోకాలు – శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి లక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము: పూజానంతరము జరిపే మంగళము : 14 శ్లోకాలు – ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించాడట.
ఒక్కొక్క భాగంలోని శ్లోకాల సంక్షిప్త వివరణ (అనువాదం కాదు), ఉదాహరణ శ్లోకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
Venkateswara Suprabhatam Lyrics in Telugu:
॥ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ॥
ఆరంభ శ్లోకం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥
తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥
తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥
తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.
తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥
తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.
అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 5 ॥
తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి ।
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 6 ॥
తా. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానాం ।
ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 7 ॥
తా. కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని ।
భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 8 ॥
తా. ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!
తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోఽపి ।
భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 9 ॥
తా. ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.
భృంగావళీ చ మకరంద రసాను విద్ధ
ఝుంకారగీత నినదైః సహసేవనాయ ।
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 10 ॥
తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.
యోషాగణేన వరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః ।
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 11 ॥
తా. ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః ।
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 12 ॥
తా. సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 13 ॥
తా. శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః ।
ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 14 ॥
తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ।
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 15 ॥
తా. ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.
సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః ।
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 16 ॥
తా. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః ।
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 17 ॥
తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీు సుప్రభాతమగు గాక.
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 18 ॥
తా. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః ।
కల్పాగమా కలనయాఽఽకులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 19 ॥
తా. ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః ।
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 20 ॥
తా. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే ।
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 21 ॥
తా. ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే ।
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 22 ॥
తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.
కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే ।
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 23 ॥
తా. మన్మధుని గర్వము నణచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిభ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాత మగుగాక.
మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర ।
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 24 ॥
తా. ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం ।
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం ॥ 25 ॥
తా. ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః ।
శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం ॥ 26 ॥
తా. ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ।
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 27 ॥
తా. ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో ।
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 28 ॥
తా. ఓ దేవా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం (ఇత్థం వృషాచలపతే తవ సుప్రభాతమ్- కొన్ని పుస్తకాలలొ ఇల కూడ ఉన్ది)
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ।
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥
తా. వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.
Also Read :
Tirupati Balaji Suprabhatam | Sri Venkateswara Suprabhatam Lyrics in Hindi | English | Bengali | Gujarati | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil
Good
Very pleasing to the ????
Om Namah Shivaya