Sri Lalitha Chalisa in Telugu:
॥ శ్రీ లలితా చాలీసా ॥
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || ౧ ||
హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || ౨ ||
పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || ౩ ||
శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి || ౪ ||
నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు || ౫ ||
కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు || ౬ ||
శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా || ౭ ||
మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి || ౮ ||
పసిడి వెన్నెలా కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి || ౯ ||
రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు || ౧౦ ||
కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి || ౧౧ ||
రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగ
రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు || ౧౨ ||
ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రం చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా || ౧౩ ||
మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్య బాధలు తొలిగించి మహదానందము కలిగించే || ౧౪ ||
అర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా || ౧౫ ||
విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి || ౧౬ ||
ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ || ౧౭ ||
దక్షుని ఇంట జనియించి సతీదేవిగ చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ || ౧౮ ||
శంఖు చక్రమును ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు || ౧౯ ||
పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగ
చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరయించితివి || ౨౦ ||
పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే || ౨౧ ||
సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి || ౨౨ ||
మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ || ౨౩ ||
సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి || ౨౪ ||
మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి || ౨౫ ||
చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే || ౨౬ ||
అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం || ౨౭ ||
అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా || ౨౮ ||
నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు || ౨౯ ||
రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి || ౩౦ ||
అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి || ౩౧ ||
గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి || ౩౨ ||
పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి || ౩౩ ||
కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా || ౩౪ ||
ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు || ౩౫ ||
మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి || ౩౬ ||
త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా || ౩౭ ||
ఆశ్రితులందరు రారండి అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము || ౩౮ ||
సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు || ౩౯ ||
మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము || ౪౦ ||
Also Read:
Sri Lalitha Chalisa Lyrics in English | Telugu