Sri Rama Pattabhishekam Sarga in Telugu :
(ఈ అర్థము శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.)
శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః |
బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమమ్ || ౧ ||
అర్థం – శిరస్సుపైన తన చేతులతో అంజలి ఘటించి, కైకేయీ ఆనంద వర్ధనుడైన భరతుడు, తన పెద్ద అన్నగారు, సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో ఇట్లు పలికెను.
పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ |
తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ || ౨ ||
అర్థం – “పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరల మీకు తిరిగి ఇస్తున్నాను.”
ధురమేకాకినా న్యస్తామృషభేణ బలీయసా |
కిశోరవద్గురుం భారం న వోఢుమహముత్సహే || ౩ ||
అర్థం – బలమైన ఎద్దువలె మోయదగిన ఈ బరువును (రాజ్యభారము) లేగదూడ వలె ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను.
వారివేగేన మహతా భిన్నః సేతురివ క్షరన్ |
దుర్బంధనమిదం మన్యే రాజ్యచ్ఛిద్రమసంవృతమ్ || ౪ ||
అర్థం – నదీవేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలె, ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడక ఉన్నదని నాకు అనిపించుచున్నది.
గతిం ఖర ఇవాశ్వస్య హంసస్యేవ చ వాయసః |
నాన్వేతుముత్సహే రామ తవ మార్గమరిందమ || ౫ ||
అర్థం – గుర్రములయొక్క గతిని ఒక గాడిద, హంసలయొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా, నేను మీ మార్గమును అందుకొనలేక పోవుచున్నాను, ఓ శత్రునాశకా !
యథా చారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే |
మహాంశ్చ సుదురారోహో మహాస్కంధః ప్రశాఖవాన్ || ౬ ||
అర్థం – యెటులైతే ఇంటి పెరటిలో నాటి, పెంచబడిన వృక్షము పెద్దదై, భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడక..
శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ |
తస్య నానుభవేదర్థం యస్య హేతోః స రోప్యతే || ౭ ||
అర్థం – .. పుష్పములు కలిగన తరువాత, ఫలములు కలుగక ఎండిపోవునో, అటువంటి చెట్టు, నాటిన వాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లు …
ఏషోపమా మహాబాహో త్వదర్థం వేత్తుమర్హసి |
యద్యస్మాన్మనుజేంద్ర త్వం భక్తాన్భృత్యాన్న శాధి హి || ౮ ||
అర్థం – ..ఈ ఉపమానము, (గొప్ప భుజములు కల) ఓ మహాబాహో ! మీ దాసులగు మమ్ములను రాజువలె పరిపాలింపని మీకు అర్థము కాగలదు.
జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః |
ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసమ్ || ౯ ||
అర్థం – జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే, అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను.
తూర్యసంఘాతనిర్ఘోషైః కాంచీనూపురనిస్వనైః |
మధురైర్గీతశబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవ || ౧౦ ||
అర్థం – సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకొలుపునంతవరకు మీరు విశ్రాంతి తీసుకొనుము.
యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా |
తావత్త్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ || ౧౧ ||
అర్థం – “ఎప్పటివరకు జ్యోతిశ్చక్రము (ఖగోళము) ఉండునో, ఎప్పటివరకు వసుంధర (భూమి) ఉండునో, అప్పటివరకు ఈ లోకమున మీ స్వామిత్వమును (పరిపాలనను) మేము అనుసరించెదము.”
భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః |
తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాసనే శుభే || ౧౨ ||
అర్థం – భరతుని వచనములు విన్న పరపురంజయుడైన (పరుల పురమును జయించిన) రాముడు, అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను.
తతః శత్రుఘ్నవచనాన్నిపుణాః శ్మశ్రువర్ధకాః |
సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత || ౧౩ ||
అర్థం – తరువాత, శత్రుఘ్నుని సూచనమేరకు, నైపుణ్యము కలిగి, తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు, రాఘవుని వద్దకు వచ్చిరి.
పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే |
సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే || ౧౪ ||
అర్థం – ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడగు లక్ష్మణుడు, వానరరాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు, స్నానము చేసెను.
విశోధితజటః స్నాతశ్చిత్రమాల్యానులేపనః |
మహార్హవసనో రామస్తస్థౌ తత్ర శ్రియా జ్వలన్ || ౧౫ ||
అర్థం – చిక్కులువిడదీయబడిన జటలతో స్నానముచేసి, అందమైన మాలలతో, గంధములతో లేపనము చేయబడి, శ్రేష్ఠమగు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను.
ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ |
లక్ష్మణస్య చ లక్ష్మీవానిక్ష్వాకుకులవర్ధనః || ౧౬ ||
అర్థం – రామునియొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశ వర్ధనుడు (శతృఘ్నుడు) లక్ష్మణునికి కూడా చేయసాగెను.
ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః |
ఆత్మనైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరమ్ || ౧౭ ||
అర్థం – సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు (దశరథ భార్యలు) తమకు తాము చేసుకొనినట్లు మనోహరముగా చేసిరి.
తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనమ్ |
చకార యత్నాత్కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా || ౧౮ ||
అర్థం – తరువాత వానరపత్నులందరకును, పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌసల్య ఉత్సాముగా అలంకారము చేసెను.
తతః శత్రుఘ్నవచనాత్సుమంత్రో నామ సారథిః |
యోజయిత్వాఽభిచక్రామ రథం సర్వాంగశోభనమ్ || ౧౯ ||
అర్థం – తరువాత, శత్రుఘ్నుని ఆదేశముమేర సుమంత్రుడు అను పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను.
అర్కమండలసంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమమ్ |
ఆరురోహ మహాబాహూ రామః సత్యపరాక్రమః || ౨౦ ||
అర్థం – సూర్యమండలము వంటి శోభకలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు, సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను.
సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్రసదృశద్యుతీ |
స్నాతౌ దివ్యనిభైర్వస్త్రైర్జగ్మతుః శుభకుండలౌ || ౨౧ ||
అర్థం – సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభకలవారై, స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని, శుభకరమైన చెవికుండలములు పెట్టుకొనిరి.
వరాభరణసంపన్నా యయుస్తాః శుభకుండలాః |
సుగ్రీవపత్న్యః సీతా చ ద్రష్టుం నగరముత్సుకాః || ౨౨ ||
అర్థం – గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవపత్ని మరియు సీతా, నగరము చూచుటకు ఉత్సాహముగా యుండిరి.
అయోధ్యాయాం తు సచివా రాజ్ఞో దశరథస్య యే |
పురోహితం పురస్కృత్య మంత్రయామాసురర్థవత్ || ౨౩ ||
అర్థం – అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు, పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి.
అశోకో విజయశ్చైవ సుమంత్రశ్చైవ సంగతాః |
మంత్రయన్రామవృద్ధ్యర్థమృద్ధ్యర్థం నగరస్య చ || ౨౪ ||
అర్థం – అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి, రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి.
సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః |
కర్తుమర్హథ రామస్య యద్యన్మంగళపూర్వకమ్ || ౨౫ ||
అర్థం – “మహాత్ముడైన రాముని పట్టభిషేకము కొరకు విజయసూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి.”
ఇతి తే మంత్రిణః సర్వే సందిశ్య తు పురోహితమ్ |
నగరాన్నిర్యయుస్తూర్ణం రామదర్శనబుద్ధయః || ౨౬ ||
అర్థం – అని ఆ మంత్రులకు, అందరు పురోహితులకు తగు సూచనలు చేసి, శ్రీరామ దర్శనముకొరకు నగరము నుండి బయలుదేరిరి.
హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానఘః |
ప్రయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమమ్ || ౨౭ ||
అర్థం – పచ్చటి గుర్రములకు కట్టబడియున్న ఉత్తమైన రథమునందు, వేయికనుల వానివలె (ఇంద్రుడు) కళంకరహితుడగు రాముడు స్వారీ చేయసాగెను.
జగ్రాహ భరతో రశ్మీఞ్శత్రుఘ్నశ్ఛత్రమాదదే |
లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్యవీజయత్ || ౨౮ ||
అర్థం – భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రమును (గొడుగు) పట్టుకొనెను. లక్ష్మణుడు వ్యజనమును (విసినకర్ర) పట్టుకొని రాముని నుదుటకు గాలి వీయసాగెను.
శ్వేతం చ వాలవ్యజనం జగ్రాహ పురతః స్థితః |
అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః || ౨౯ ||
అర్థం – తెలుపు రంగు వాలవ్యజనమును (చామరమును) ముందువైపున, చంద్రప్రభ కలిగిన రాక్షసరాజగు విభీషణుడు పట్టుకొనెను.
ఋషిసంఘైస్తదాఽఽకాశే దేవైశ్చ సమరుద్గణైః |
స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిః || ౩౦ ||
అర్థం – అప్పుడు ఆకాశమునందు ఋషిసమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి.
తతః శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమమ్ |
ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః || ౩౧ ||
అర్థం – అప్పుడు, శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహాతేజోవంతుడు, వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించెను.
నవనాగసహస్రాణి యయురాస్థాయ వానరాః |
మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః || ౩౨ ||
అర్థం – తొమ్మిది వేల ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్యరూపమున సర్వాభరణములతో అగుపించిరి.
శంఖశబ్దప్రణాదైశ్చ దుందుభీనాం చ నిస్స్వనైః |
ప్రయయౌ పురుషవ్యాఘ్రస్తాం పురీం హర్మ్యమాలినీమ్ || ౩౩ ||
అర్థం – శంఖము యొక్క శబ్దము మరియు దుందుభీ (ఢంకా) యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా, పురుషవ్యాఘ్రము (పురుషులలో పులివంటివాడు) భవనముల మాలలు కలిగిన (అయోధ్య) పురమునందు వెడలసాగెను.
దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరమ్ |
విరాజమానం వపుషా రథేనాతిరథం తదా || ౩౪ ||
అర్థం – ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో, అతిరథుని (గొప్ప యోధుని) వలె కనిపించెను.
తే వర్ధయిత్వా కాకుత్స్థం రామేణ ప్రతినందితాః |
అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితమ్ || ౩౫ ||
అర్థం – తనకు జేజేలు పలుకు వారిని కాకుత్స్థుడు (రాముడు) తిరిగి పలకరింపగా, వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి.
అమాత్యైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృతః |
శ్రియా విరురుచే రామో నక్షత్రైరివ చంద్రమాః || ౩౬ ||
అర్థం – మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడగు రాముడు, నక్షత్రముల మధ్య చంద్రునివలె శోభించెను.
స పురోగామిభిస్తూర్యైస్తాలస్వస్తికపాణిభిః |
ప్రవ్యాహరద్భిర్ముదితైర్మంగళాని యయౌ వృతః || ౩౭ ||
అర్థం – ముందువైపు నడుస్తున్నవారు తాళములు, స్వస్తిక వాద్యపరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము, మంగళకరము అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను.
అక్షతం జాతరూపం చ గావః కన్యాస్తథా ద్విజాః |
నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః || ౩౮ ||
అర్థం – బంగారువర్ణము గల అక్షతలతో (బియ్యపుగింజలు), గోవులతో, కన్యలతో, ద్విజులతో (బ్రాహ్మణులు) వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపిపదార్థములు పట్టుకుని రాముని ముందువైపు వెళ్ళసాగారు.
సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం చానిలాత్మజే |
వానరాణాం చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలమ్ |
విభీషణస్య సంయోగమాచచక్షే చ మంత్రిణామ్ || ౩౯ ||
అర్థం – రాముడు, సుగ్రీవునితో స్నేహమును, అనిలాత్మజుని (హనుమంతుని) బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణుతో జరిగిన సమావేశమును, మంత్రులకు వర్ణించసాగెను.
శ్రుత్వా తు విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః || ౪౦ ||
అర్థం – ఇది వినిన అయోధ్యా పురవాసులు విస్మయము (ఆశ్చర్యము) చెందిరి.
ద్యుతిమానేతదాఖ్యాయ రామో వానరసంవృతః |
హృష్టపుష్టజనాకీర్ణామయోధ్యాం ప్రవివేశ హ || ౪౧ ||
అర్థం – ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుతూ, వానరములతో కలసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను.
తతో హ్యభ్యుచ్ఛ్రయన్పౌరాః పతాకాస్తే గృహే గృహే || ౪౨ ||
అర్థం – తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి.
ఐక్ష్వాకాధ్యుషితం రమ్యమాససాద పితుర్గృహమ్ || ౪౩ ||
అర్థం – రమ్యము, ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రిగృహమునకు (రాముడు) చేరెను.
అథాబ్రవీద్రాజసుతో భరతం ధర్మిణాం వరమ్ |
అర్థోపహితయా వాచా మధురం రఘునందనః || ౪౪ ||
అర్థం – తరువాత ఆ రాజపుత్రుడగు రఘునందనుడు (రాముడు), ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలకసాగెను.
పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః |
కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీమభివాద్య చ || ౪౫ ||
అర్థం – పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు, కౌసల్యా, సుమిత్రా మరియు కైకేయీ లకు నమస్కరించెను. (తరువాత ఇటుల చెప్పసాగెను).
యచ్చ మద్భవనం శ్రేష్ఠం సాశోకవనికం మహత్ |
ముక్తావైడూర్యసంకీర్ణం సుగ్రీవాయ నివేదయ || ౪౬ ||
అర్థం – “(భరతా!) నా ఈ భవనము శ్రేష్ఠమైనది, అశోకవనములతో కూడియున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగబడియున్నది. దీనిని సుగ్రీవునకు ఇవ్వుము” అనెను.
తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః |
పాణౌ గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయమ్ || ౪౭ ||
అర్థం – ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడగు భరతుడు, సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకువచ్చెను.
తతస్తైలప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ |
గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః || ౪౮ ||
అర్థం – అప్పుడు తైలదీపములు, మంచములు, నేలచాపలు తీసుకుని శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు (సహాయకులు) గృహములోకి వచ్చిరి.
ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః |
అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో || ౪౯ ||
అర్థం – మహాతేజోవంతుడగు రాఘవుని తమ్ముడు (భరతుడు) సుగ్రీవునితో “రాముని అభిషేకముకొరకు దూతలను పురమాయింపుము” అని అడిగెను.
సౌవర్ణాన్వానరేంద్రాణాం చతుర్ణాం చతురో ఘటాన్ |
దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్నవిభూషితాన్ || ౫౦ ||
అర్థం – సువర్ణమయము, సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానరశ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. (తరువాత ఇట్లు పలికెను.)
యథా ప్రత్యూషసమయే చతుర్ణాం సాగరాంభసామ్ |
పూర్ణైర్ఘటైః ప్రతీక్షధ్వం తథా కురుత వానరాః || ౫౧ ||
అర్థం – “రేపు తెల్లవారే లోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి, నా ఆజ్ఞకోసము వేచియుండండి” అని పలికెను.
ఏవముక్తా మహాత్మానో వానరా వారణోపమాః |
ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః || ౫౨ ||
అర్థం – మహాత్ముడగు వానరశ్రేష్ఠుడు ఇటుల చెప్పగనే, వారు గరుడునివలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి.
జాంబవాంశ్చ హనూమాంశ్చ వేగదర్శీ చ వానరః |
ఋషభశ్చైవ కలశాఞ్జలపూర్ణానథానయన్ || ౫౩ ||
అర్థం – అటు తరువాత జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శీ మరియు ఋషభుడు అను వానరులు, నీరునింపబడిన కలశములతో వచ్చిరి.
నదీశతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్ || ౫౪ ||
అర్థం – అయిదువందల నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి.
పూర్వాత్సముద్రాత్కలశం జలపూర్ణమథానయత్ |
సుషేణః సత్త్వసంపన్నః సర్వరత్నవిభూషితమ్ || ౫౫ ||
అర్థం – తూర్పుసముద్రము యొక్క నీటిచే నింపబడిన, రత్నమయమైన కలశమును సత్త్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను.
ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జలమాహరత్ |
రక్తచందనశాఖాభిః సంవృతం కాంచనం ఘటమ్ || ౫౬ ||
అర్థం – ఋషభుడు త్వరగా దక్షిణసముద్రము యొక్క జలమును, ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను.
గవయః పశ్చిమాత్తోయమాజహార మహార్ణవాత్ |
రత్నకుంభేన మహతా శీతం మారుతవిక్రమః || ౫౭ ||
అర్థం – గవయుడు పశ్చిమమహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభము (కలశము) లో వాయువేగముగ తెచ్చెను.
ఉత్తరాచ్చ జలం శీఘ్రం గరుడానిలవిక్రమః |
ఆజహార స ధర్మాత్మా నలః సర్వగుణాన్వితః || ౫౮ ||
అర్థం – ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా, గరుడ మరియు వాయువిక్రమము గల ధర్మాత్ముడు, సర్వగుణసంపన్నుడు అయిన నలుడు తెచ్చెను.
తతస్తైర్వానరశ్రేష్ఠైరానీతం ప్రేక్ష్య తజ్జలమ్ |
అభిషేకాయ రామస్య శత్రుఘ్నః సచివైః సహ |
పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ న్యవేదయత్ || ౫౯ ||
అర్థం – అలా వానరశ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి, శత్రుఘ్నుడు తన మంత్రులతో కలసి, పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను.
తతః స ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ |
రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్ || ౬౦ ||
అర్థం – అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠులవారు, తోటి బ్రాహ్మణులతో కలసి, రత్నమయ పీఠము పైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండబెట్టెను.
వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః |
కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా || ౬౧ ||
అర్థం – వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు ..
అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా |
సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా || ౬౨ ||
అర్థం – .. నరవ్యాఘ్రమును (నరులలో పులివంటి రాముడికి) సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో, అష్టవసువులు సహస్రాక్షునికి (ఇంద్రునికి) చేసినట్లు, అభిషేకము చేసిరి.
ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా |
యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః || ౬౩ ||
అర్థం – ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో, ఆనందముగా యున్న పట్టణవాసులతో అభిషేకము చేయించితిరి.
సర్వౌషధిరసైర్దివ్యైర్దైవతైర్నభసి స్థితైః |
చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః || ౬౪ ||
అర్థం – సర్వ ఔషధరసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి చల్లిరి.
బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్ |
అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్తతేజసమ్ || ౬౫ ||
అర్థం – బ్రహ్మచే (సృష్టికి) పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నములశోభతో యున్నది. దీనితో చాలా కాలము క్రితము మను కు పట్టాభిషేకము చేయుటవలన తేజస్సుచే దీప్తమైనది.
తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః |
సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః |
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః || ౬౬ ||
అర్థం – ఆయన తరువాత ఉన్న రాజుల క్రమమునకు (పరంపరకు) దీనిచే పట్టాభిషేకము చేయబడినది. (ఇప్పుడు) సభయందు బంగారువర్ణపు శోభతో, మహాధనవంతమగునది, వివిధరత్నములచేత చిత్రముగా మంచిశోభను కలిగియున్నది.
నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి |
కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా |
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః || ౬౭ ||
అర్థం – నానారత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వసిష్ఠులవారు (తన) తోటి ఋత్విక్కులతో కలసి మిగిలిన భూషణములతోపాటు రాఘవునకు అలంకారము చేసిరి.
ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభమ్ |
శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః |
అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః || ౬౮ ||
అర్థం – శుభకరమైన ధవళ ఛత్రమును (గొడుగు) శత్రుఘ్నుడు పట్టుకొనెను. తెలుపు రంగు వాలవ్యజనమును (చామరమును) వానరేశ్వరుడగు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రునివలె మెరయు మరియొక వ్యజనమును రాక్షసరాజగు విభీషణుడు గొనెను.
మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరామ్ |
రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః || ౬౯ ||
అర్థం – నూరు బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను, రాఘవునకు వాయుదేవుడు, వాసవుని (ఇంద్రుని) ప్రోత్సాహముతో ఇచ్చెను.
సర్వరత్నసమాయుక్తం మణిరత్నవిభూషితమ్ |
ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్రప్రచోదితః || ౭౦ ||
అర్థం – సర్వరత్నములతో పొదగబడి, మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యములహారమును, ఆ రాజునకు, శక్రుని (ఇంద్రుని) ఆదేశము మేర (వాయుదేవుడు) ఇచ్చినాడు.
ప్రజగుర్దేవగంధర్వా ననృతుశ్చాప్సరోగణాః |
అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః || ౭౧ ||
అర్థం – లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు, బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను.
భూమిః సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః |
గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే || ౭౨ ||
అర్థం – భూమి సస్యశ్యామలముగా, ఫలములుతో చెట్లు, మంచి సువాసనలతో పుష్పములు, రాఘవ ఉత్సవములో నిండినవి.
సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా |
దదౌ శతం వృషాన్పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః || ౭౩ ||
అర్థం – నూరు సహస్రములగా అశ్వములను, ధేనువులను, గోవులను, నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజ శ్రేష్ఠుడు (రాముడు) ఇచ్చెను.
త్రింశత్కోటీర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః |
నానాభరణవస్త్రాణి మహార్హాణి చ రాఘవః || ౭౪ ||
అర్థం – మూడువందలకోట్ల బంగారునాణెములు, నానావిధములైన, విలువైన, ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను.
అర్కరశ్మిప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహామ్ |
సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్మనుజర్షభః || ౭౫ ||
అర్థం – సూర్యరశ్మివంటి ప్రభతో, బంగారముతో పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు (రాముడు) ఇచ్చెను.
వైడూర్యమణిచిత్రే చ వజ్రరత్నవిభూషితే |
వాలిపుత్రాయ ధృతిమానంగదాయాంగదే దదౌ || ౭౬ ||
అర్థం – వైడూర్యమణితో చిత్రితమై, వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును (కేయూరమును) వాలిపుత్రుడు, ధృతిమంతుడు అయిన అంగదునకు (రాముడు) ఇచ్చెను.
మణిప్రవరజుష్టం చ ముక్తాహారమనుత్తమమ్ |
సీతాయై ప్రదదౌ రామశ్చంద్రరశ్మిసమప్రభమ్ || ౭౭ ||
అర్థం – శ్రేష్ఠములైన మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో యున్న, ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను.
అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ |
అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే || ౭౮ ||
అర్థం – శుద్ధము, ధారణయోగ్యము, శుభకరము యైన ఆభరణములను వైదేహీ వాయుసూనునకు (హనుమంతుడు) ఇవ్వజూచెను.
అవముచ్యాత్మనః కంఠాద్ధారం జనకనందినీ |
అవైక్షత హరీన్సర్వాన్భర్తారం చ ముహుర్ముహుః || ౭౯ ||
అర్థం – జనకనందిని (సీత) తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరల మరల చూడసాగిరి.
తామింగితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజామ్ |
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని |
పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నేతాని సర్వశః || ౮౦ ||
అర్థం – ఇంగితజ్ఞానము కల రాముడు, జనకాత్మజయగు సీతను చూచి ఇట్లనెను. “ప్రియమైన సీతా, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో, ఎవ్వరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము.”
దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా |
హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః |
చంద్రాంశుచయగౌరేణ శ్వేతాభ్రేణ యథాఽచలః || ౮౧ ||
అర్థం – ఆ హారమును అసితేక్షణా (నల్లటి కనులు కలిగిన సీత) వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా, చంద్రకాంతులతో, తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతమువలె అగుపించెను.
తతో ద్వివిదమైందాభ్యాం నీలాయ చ పరన్తపః |
సర్వాన్కామగుణాన్వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః || ౮౨ ||
అర్థం – శత్రువులను హింసించునట్టి ద్వివిదునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు (రాముడు) బహుమతులు ఇచ్చెను.
సర్వవానరవృద్ధాశ్చ యే చాన్యే వానరేశ్వరాః |
వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః || ౮౩ ||
అర్థం – సర్వవానరవృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి.
విభీషణోఽథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా |
సర్వవానరముఖ్యాశ్చ రామేణాక్లిష్టకర్మణా || ౮౪ ||
అర్థం – విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వ వానరవృద్ధులను రాముడికోసం విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని..
యథార్హం పూజితాః సర్వైః కామై రత్నైశ్చ పుష్కలైః |
ప్రహృష్టమనసః సర్వే జగ్మురేవ యథాగతమ్ || ౮౫ ||
అర్థం – .. వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా, వారు సంతోషమనస్కులై తిరిగి వెడలిరి.
నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః |
విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్ || ౮౬ ||
అర్థం – వందనము చేయుచూ ఆ మహాత్ములగు వానరోత్తములు, పార్థివేంద్రునచే (రామునిచే) వీడ్కోలు తెలుపబడి కిష్కింధకు వెడలిరి.
సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనమ్ |
పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీమ్ || ౮౭ ||
అర్థం – వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి, రామునిచే సత్కరింపబడి కిష్కింధకు వెడలెను.
[* రామేణ సర్వకామైశ్చ యథార్హం ప్రతిపూజితః | *]
విభీషణోఽపి ధర్మాత్మా సహ తైర్నైరృతర్షభైః |
లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః || ౮౮ ||
అర్థం – ధర్మాత్ముడు, ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజగు విభీషణుడు, తన కులధనము (రాక్షస రాజ్యము మరియు పరివారము) తీసుకుని లంకకు మరలెను.
స రాజ్యమఖిలం శాసన్నిహతారిర్మహాయశాః |
రాఘవః పరమోదారః శశాస పరయా ముదా || ౮౯ ||
అర్థం – అఖిల రాజ్యములు శాసించగల, శత్రువులను సంహరించిన, మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో, పరమ ఆనందముతో ..
ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః || ౯౦ ||
అర్థం – .. ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడగు రాముడు ఇట్లనెను.
ఆతిష్ఠ ధర్మజ్ఞ మయా సహేమాం
గాం పూర్వరాజాధ్యుషితాం బలేన |
తుల్యం మయా త్వం పితృభిర్ధృతా యా
తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ || ౯౧ ||
అర్థం – “ధర్మజ్ఞా (ధర్మము తెలిసినవాడా), నాతో పాటు ఈ భూమిని (రాజ్యమును) పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్లు, నేను మన పితరుల నుంచి పొందినట్లు, నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకొనుము.
సర్వాత్మనా పర్యనునీయమానో
యదా న సౌమిత్రిరుపైతి యోగమ్ |
నియుజ్యమానోఽపి చ యౌవరాజ్యే
తతోఽభ్యషించద్భరతం మహాత్మా || ౯౨ ||
అర్థం – అన్నివిధముల బ్రతిమిలాడినగాని సౌమిత్రి (లక్ష్మణుడు) అంగీకారము తెలుపని కారణమున, యౌవరాజ్యాభిషేకమును మహాత్ముడు (రాముడు) భరతునకు చేసెను.
పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ |
అన్యైశ్చ వివిధైర్యజ్ఞైరయజత్పార్థివర్షభః || ౯౩ ||
అర్థం – పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు (రాముడు) ఆచరించెను.
రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః |
శతాశ్వమేధానాజహ్రే సదశ్వాన్భూరిదక్షిణాన్ || ౯౪ ||
అర్థం – రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాఘవుడు నూరు అశ్వమేధయజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతలకోసము సమర్పించెను.
ఆజానులంబబాహుః స మహాస్కంధః ప్రతాపవాన్ |
లక్ష్మణానుచరో రామః పృథివీమన్వపాలయత్ || ౯౫ ||
అర్థం – జానువులవరకు ఉన్న పొడవైన మహా భుజములతో, ప్రతాపవంతుడై, లక్ష్మణుని తోడుగా, రాముడు పృథివిని పాలించెను.
రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమమ్ |
ఈజే బహువిధైర్యజ్ఞైః ససుహృజ్జ్ఞాతిబాంధవః || ౯౬ ||
అర్థం – ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది, దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు, తన పుత్రులు, భ్రాతృలతో, బంధువులతో కలసి చేసెను.
న పర్యదేవన్విధవా న చ వ్యాలకృతం భయమ్ |
న వ్యాధిజం భయం వాఽపి రామే రాజ్యం ప్రశాసతి || ౯౭ ||
అర్థం – వైధవ్య విషాదము, కౄరమృగముల భయము, వ్యాధి భయములు లేక రామ రాజ్యము కీర్తింపబడెను.
నిర్దస్యురభవల్లోకో నానర్థః కంచిదస్పృశత్ |
న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే || ౯౮ ||
అర్థం – చోరత్వము లోకమునందు లేదు. జనుల యందు వ్యర్థభావము లేకుండె. వృద్ధులు బాలురపై ప్రేతకార్యములు చేయకుండిరి.
సర్వం ముదితమేవాసీత్సర్వో ధర్మపరోఽభవత్ |
రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్పరస్పరమ్ || ౯౯ ||
అర్థం – అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకుని పరస్పరము హింసించుకొనక యుండిరి.
ఆసన్వర్షసహస్రాణి తథా పుత్రసహస్రిణః |
నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి || ౧౦౦ ||
అర్థం – వేల వర్షముల (ఆయుర్దాయము) తో, వేలమంది పుత్రులతో, అనారోగ్యము లేక, శోకములేక రామునిచే రాజ్యము పాలింపబడెను.
రామో రామో రామ ఇతి ప్రజానామభవన్కథాః |
రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి || ౧౦౧ ||
అర్థం – రామ, రామ, రామ అని రాముని గురించి, రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను.
నిత్యపుష్పా నిత్యఫలాస్తరవః స్కంధవిస్తృతాః |
కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః || ౧౦౨ ||
అర్థం – నిత్యము పుష్పములు, ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములయందు వర్షించెను. మారుతము (గాలి) సుఖస్పర్శతో వీచెను.
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా లోభవివర్జితాః |
స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః || ౧౦౩ ||
అర్థం – బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక, తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి.
ఆసన్ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః |
సర్వే లక్షణసంపన్నాః సర్వే ధర్మపరాయణాః || ౧౦౪ ||
అర్థం – ప్రజలు ధర్మపరులై, అనృతములు (కఠినమైన మాటలు) అనక రామరాజ్యమున అందరు మంచి లక్షణములతో ధర్మపరాయణులై యుండిరి.
దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ |
భ్రాతృభిః సహితః శ్రీమాన్రామో రాజ్యమకారయత్ || ౧౦౫ ||
అర్థం – పదివేల పదివందల వర్షములు, తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలనను చేసెను.
—————–
(రామాయణ ఫలశ్రుతి)
ధన్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహమ్ |
ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతమ్ |
యః పఠేచ్ఛృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే || ౧౦౬ ||
పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ |
లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనమ్ || ౧౦౭ ||
మహీం విజయతే రాజా రిపూంశ్చాప్యధితిష్ఠతి |
రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ || ౧౦౮ ||
భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః |
భవిష్యంతి సదానందాః పుత్రపౌత్రసమన్వితాః || ౧౦౯ ||
శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విన్దతి |
రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః || ౧౧౦ ||
శృణోతి య ఇదం కావ్యమార్షం వాల్మీకినా కృతమ్ |
శ్రద్దధానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ || ౧౧౧ ||
సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః |
ప్రార్థితాంశ్చ వరాన్సర్వాన్ప్రాప్నుయాదిహ రాఘవాత్ || ౧౧౨ ||
శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతామ్ |
వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్య వై || ౧౧౩ ||
విజయేతి మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్వ్రజేత్ |
స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్ || ౧౧౪ ||
పూజయంశ్చ పఠంశ్చేమమితిహాసం పురాతనమ్ |
సర్వపాపాత్ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ || ౧౧౫ ||
ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ |
ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః || ౧౧౬ ||
రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా |
ప్రీయతే సతతం రామః స హి విష్ణుః సనాతనః || ౧౧౭ ||
ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణః ప్రభుః |
సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే || ౧౧౮ ||
కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం
స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ |
శృత్వా శుభం కావ్యమిదం మహార్థం
ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిమ్ || ౧౧౯ ||
ఆయుష్యమారోగ్యకరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ |
శ్రోతవ్యమేతన్నియమేన సద్భి-
-రాఖ్యానమోజస్కరమృద్ధికామైః || ౧౨౦ ||
ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః |
ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతామ్ || ౧౨౧ ||
దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాచ్ఛ్రవణాత్తథా |
రామాయణస్య శ్రవణాత్తుష్యంతి పితరస్తథా || ౧౨౨ ||
భక్త్యా రామస్య యే చేమాం సంహితామృషిణా కృతామ్ |
లేఖయంతీహ చ నరాస్తేషాం వాసస్త్రివిష్టపే || ౧౨౩ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే చతుర్వింశతిసహస్రికాయాం సంహితాయాం యుద్ధకాండే శ్రీరామపట్టాభిషేకో నామ ఏకత్రింశదుత్తరశతతమః సర్గః || ౧౨౪ ||
Also Read:
Sri Rama Pattabhishekam Sarga Lyrics in Hindi | English | Kannada | Telugu | Tamil