Templesinindiainfo

Best Spiritual Website

Sundaradasu Sundarakanda Part 2 | Sri MS Rama Rao

Sundaradasu (Sri MS Rama Rao) Sundarakanda Part 2:

[ ప్రథమ భాగం/Part 1 – ద్వితీయ భాగం/Part 2 ]
॥ సుందరదాసు సుందరకాండ (ద్వితీయ భాగం) ॥
తండ్రిమాట నిలుప రామచంద్రుడు
వల్కల ధారియై రాజ్యము వీడె |
సీతాలక్ష్మణులు తనతో రాగా
పదునాల్గేండ్లు వనవాసమేగె | ౧౫౧ |

ఖరదూషణాది పదునాల్గువేల
అసురుల జంపె జనస్థానమున |
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ | ౧౫౨ |

రాముడు వెడలె సీత కోర్కె పై
మాయ లేడిని కొనితెచ్చుటకై |
రామ లక్ష్మణులు లేని సమయమున
అపహరించె లంకేశుడు సీతను | ౧౫౩ |

సీతను గానక రామచంద్రుడు
అడవుల పాలై వెదకుచుండెను |
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ | ౧౫౪ |

రామసుగ్రీవులు వనమున కలిసిరి
మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి |
శ్రీరఘురాముడు వాలిని గూల్చెను
సుగ్రీవుని కపిరాజుగ జేసెను | ౧౫౫ |

సుగ్రీవులాన లంక చేరితి
సీతా మాతను కనుగొన గలిగితి |
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ | ౧౫౬ |

వానరోత్తముడు పలుకుట మానెను
జానకికెంతో విస్మయమాయెను |
భయము భయముగ నలువంకలు గని
మెల్లగ మోమెత్తి పైకి చూచెను | ౧౫౭ |

శోభిల్లు శంశుపా శాఖలందున
బాలార్కుని వలె మారుతి తోచెను |
మారుతి రూపము చిన్నదైనను
తేజోమయమై భీతి గొల్పెను | ౧౫౮ | శ్రీ హనుమాను |

తల్లీ ! తెల్పుము నీవు యెవరవో
దేవ గంధర్వ కిన్నెరాంగనవో |
కాంతులు మెరసే బంగరు మేన
మలినాంబరమేల దాల్చితివో ?౧౫౯ |

ఓ కమలాక్షీ ! నీ కనుదోయి
నీలాలేల నింపితివో ?
అని హనుమంతుడు తరువు నుండి దిగి
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౧౬౦ |

రావణాసురుడు అపహరించిన
రాముని సతివో నీవు సీతవో ?
రామ లక్ష్మణులు వనమున వెదకెడు
అవనీజాతవో నీవు సీతవో ?౧౬౧ |

సర్వ సులక్షణ లక్షిత జాతవు
తల్లీ తెల్పుము నీవు యెవరవో ?
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౧౬౨ |

జనక మహీపతి ప్రియ పుత్రికను
దశరథ మహిపతి పెద్ద కోడలను |
శ్రీరఘురాముని ప్రియసతి నేను
సీత యను పేర వరలు దానను | ౧౬౩ |

పరిణయమైన పదిరెండేడులు
అనుభవించితిని భోగభాగ్యములు |
అని పల్కె సీత వానరేంద్రునితో
రామ కథను కీర్తించిన వానితో | ౧౬౪ |

రావణుడొసగిన యేడాది గడువు
రెండు నెలలో యిక తీరిపోవు |
రాముడు నన్ను కాపాడునని
వేచి వేచి వేసారి పోతిని | ౧౬౫ |

అసురులు నన్ను చంపక ముందే
నాకై నేను పోనెంచితిని |
అని పల్కె సీత వానరేంద్రునితో
రామ కథను కీర్తించిన వానితో | ౧౬౬ |

అమ్మా సీతా, నమ్ముము నన్ను
రాముని దూతగా వచ్చినాడను |
రామలక్ష్మణులు క్షేమమన్నారు
నీ క్షేమమరసి రమ్మన్నారు | ౧౬౭ |

రాముడు నీకు దీవెనలంపె
సౌమిత్రి నీకు వందనములిడె |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి ముందుకు జరిగె | ౧౬౮ |

మారుతి యెంతగా ముందుకు జరిగెనో
జానకి అంతగా అనుమానించెను |
రావణాసురుడే ఈ వానరుడని
కామరూపుడై వచ్చి యుండునని | ౧౬౯ |

ఆశ్రమమున వొంటిగనున్న తనను
వంచించిన సన్యాసి యీతడని|
తల వాల్చుకొని భయకంపితయై
కటిక నేలపై జానకి తూలె | ౧౭౦ |

వానరరాజు సుగ్రీవుని మంత్రిని
నన్ను పిలుతురు హనుమంతుడని |
రామ సుగ్రీవులు మిత్రులైనారు
నీ జాడ తెలియ వేచియున్నారు | ౧౭౧ |

రామలక్ష్మణులు వానర రాజుతో
లంక చేరెదరు వానర కోటితో |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౧౭౨ | శ్రీ హనుమాను |

ఓ హనుమంతా ! హాయి పొందితిని
నీ పలికిన శ్రీరామ కథ విని |
రామలక్ష్మణుల యెట్లెరిగితివి ?
రూపు రేఖలను యెట్లు గాంచితివి ?౧౭౩ |

వారి మాటలను యెట్లు వింటివి ?
వారి గుణములను యెట్లు తెలిసితివి ?
అని పల్కె సీత హనుమంతునితో
రామ కథను కీర్తించిన వానితో | ౧౭౪ |

సర్వ జీవన సంప్రీతి పాత్రుడు
కమల నేత్రుడు దయా సాంద్రుడు |
బుద్ధి యందు బృహస్పతి సముడు
కీర్తి యందు దేవేంద్రుని సముడు | ౧౭౫ |

క్షమా గుణమున పృథివీ సముడు
సూర్య తేజుడు శ్రీరఘురాముడు |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౧౭౬ |

అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు
అన్నిట రాముని సరిపోలు వాడు |
అన్నకు తోడు నీడయై చెలగెడు
అజేయుడు శత్రుభయంకరుడు | ౧౭౭ |

సామాన్యులు కారు సోదరులిరువురు
నిను వెదకుచు మమ్ము కలసినారు |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౧౭౮ |

పవనకుమారుని పలుకులను విని
అతడు నిజముగా రామదూత యని |
ఆనందాశ్రులు కన్నులు నిండగ
చిరు నగవులతో జానకి చూడగ | ౧౭౯ |

ఇదిగో తల్లీ ! యిది తిలకింపుము
రాముడంపిన అంగుళీయకము |
అని హనుమంతుడు భక్తి మీరగను
అంగుళీయకమును సీతకొసగెను | ౧౮౦ | శ్రీ హనుమాను |

రామచంద్రుని ముద్రిక చేకొని
అశ్రులు నిండిన కనులకద్దుకొని |
మధుర స్మృతులు మదిలో మెదల
సిగ్గు చేత తన శిరము వంచుకొని | ౧౮౧ |

యిన్ని రోజులకు తనకు కలిగిన
శుభ శకునముల విశేషమనుకొని |
జానకి పల్కె హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో | ౧౮౨ |

యెన్నడు రాముడు యిటకేతెంచునో
యెన్నడు రావణుని హతము సేయునో ?
లక్ష్మణుండు తన అగ్ని శరములతో
కౄర రాక్షసుల రూపు మాపునో ? ౧౮౩ |

సుగ్రీవుడు తన వానరసేనతో
చుట్టి ముట్టి యీ లంకను గూల్చునో ?
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో | ౧౮౪ |

రామలక్ష్మణులు వచ్చుదాకను
బ్రతుకనిత్తురా అసురులు నన్ను ?
రావణుడొసగిన యేడాది గడువు
రెండు నెలలలో యిక తీరిపోవు | ౧౮౫ |

ప్రాణములను అరచేత నిల్పుకొని
యెదురు చూతునీ రెండు మాసములు |
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో | ౧౮౬ |

నీ వలెనే శ్రీరామచంద్రుడు
నిద్రాహారములు మరచెనమ్మా !
ఫలపూష్పాదులు ప్రియమైనవి గని
“హా సీతా” యని శోకించునమ్మా | ౧౮౭ |

నీ జాడ తెలిసి కోదండపాణి
తడవు సేయకే రాగలడమ్మా |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౧౮౮ |

ఓ హనుమంతా ! నిను గనినంత
నాలో కలిగె ప్రశాంతత కొంత |
వానరోత్తమా ! నిను వినినంత
నే పొందితిని వూరట కొంత | ౧౮౯ |

రాముని వేగమె రమ్మని తెల్పుము
రెండు నెలల గడువు మరువబోకుము |
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో | ౧౯౦ | శ్రీ హనుమాను |

తల్లీ నీవిటు శోకింపనేల
వగచి వగచి యిటు భీతిల్లనేల ?
యిపుడే నీకీ చెర విడిపింతును
కూర్చుండుము నా మోపు మీదను | ౧౯౧ |

వచ్చిన త్రోవనే కొనిపోయెదను
శ్రీరామునితో నిను చేర్చెదను |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౧౯౨ |

పోనివ్వక పోతివిగా హనుమా !
సహజమైన నీ చంచల భావము |
అరయగ అల్ప శరీరుడవీవు
యే తీరుగ నను కొని పోగలవు ?౧౯౩ |

రాముని కడకే నను చేర్చెదవో
కడలిలోననే జారవిడుతువో |
అని పల్కె సీత హనుమంతునితో
తనలో కలిగిన వాత్సల్యముతో | ౧౯౪ |

సీత పలికిన మాటల తీరును
హనుమంతుడు విని చిన్నబోయెను |
సీత చెంత తన కామ రూపమును
ప్రదర్శింపగా సంకల్పించెను | ౧౯౫ |

కొండంతగ తన కాయము పెంచెను
కాంతివంతుడై చెంత నిలచెను |
జయ హనుమంతుని కామరూపమును
ఆశ్చర్యముతో జానకి చూచెను | ౧౯౬ |

అద్భుతమౌ నీ కామరూపమును
కాంచితినయ్యా శాంతింపుమయ్యా !
పవనకుమారా నీవు గాక మరి
యెవరీ వారిధి దాటెదరయ్యా ! ౧౯౭ |

కౄర రాక్షసుల కంట బడకయే
లంక వెదకి నను కనగలరయ్యా |
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో | ౧౯౮ | శ్రీ హనుమాను |

తల్లీ ! నేను నీ యందుగల
భక్తి భావమున అటుల తెల్పితి |
కౄర రాక్షసుల బారి నుండి నిను
కాపాడనెంచి అటుల పల్కితి | ౧౯౯ |

వేగమె నిన్ను రాముని జేర్చెడు
శుభ ఘడియలకై త్వరపడి పల్కితి |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౨౦౦ |

తల్లీ నీవు తెలిపినవన్నీ
శ్రీరామునకు విన్నవించెదను |
సత్య ధర్మ పవిత్ర చరిత్రవు
శ్రీరామునకు తగిన భార్యవు | ౨౦౧ |

అమ్మా యిమ్ము యేదో గురుతుగ
శ్రీరాముడు గని ఆనందింపగ |
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె | ౨౦౨ |

చిత్రకూటమున కాకాసురు కథ
కన్నీరొలుకగ గురుతుగ తెలిపి |
చెంగుముడి నున్న చూడామణిని
మెల్లగ తీసి మారుతికొసగి | ౨౦౩ |

పదిలముగా కొని పోయిరమ్మని
శ్రీరామునకు గురుతుగ నిమ్మని |
ప్రీతి పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో | ౨౦౪ |

చేతులారగా చూడామణి గొని
ఆనందముగా కనులకద్దుకొని |
వైదేహికి ప్రదక్షిణలు జేసి
పదముల వ్రాలి వందనములిడి | ౨౦౫ |

మనమున రాముని ధ్యానించుకొని
మరలిపోవగా అనుమతి గైకొని |
అంజనీసుతుడు కాయము పెంచె
ఉత్తర దిశగా కుప్పించి యెగసె | ౨౦౬ | శ్రీ హనుమాను |

సీత జాడ గని మరలిన చాలదు
చేయవలసినది యింకను కలదు |
కల్పించుకుని కలహము పెంచెద
అసురవీరుల పరిశీలించెద | ౨౦౭ |

రాక్షస బలముల శక్తి గ్రహించెద
సుగ్రీవాదులకు విన్నవించెద |
అని హనుమంతుడు యోచన జేయుచు
తోరణ స్తంభము పైన నిల్చెను | ౨౦౮ |

పద్మాకరముల పాడొనరించి
జలాశయముల గట్టులు త్రెంచి |
ఫల వృక్షముల నేలను కూల్చి
ఉద్యానముల రూపులు మాపి | ౨౦౯ |

ప్రాకారముల బ్రద్దలు చేసి
ద్వారబంధముల ధ్వంసము జేసి |
సుందరమైన అశోకవనమును
చిందర వందర చేసె మారుతి | ౨౧౦ |

మృగ సమూహములు భీతిల్లినవై
తత్తరపాటుగ పరుగులు తీయగ |
పక్షుల గుంపులు చెల్లాచెదరై
దీనారవముల యెగిరి పోవగా | ౨౧౧ |

సీత యున్న శింశుపా తరువు వినా
వనమంతయు వినాశము కాగా |
సుందరమైన అశోకవనమును
చిందర వందర చేసె మారుతి | ౨౧౨ |

వనమున రేగిన ధ్వనులకు అదిరి
లంకావాసులు నిద్ర లేచిరి |
కావలియున్న రాక్షస వనితలు
రావణు చేరి విన్నవించిరి | ౨౧౩ |

దశకంఠుడు మహోగ్రుడై పల్కె
వానరుని బట్టి దండింపుడనె |
యెనుబది వేల కింకర వీరులు
హనుమంతునిపై దాడి వెడలిరి | ౨౧౪ |

యెనుబది వేల కింకర వీరుల
వొక్క వానరుడు హతము చేసెను |
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను | ౨౧౫ |

జంబుమాలిని తగిన బలము గొని
ఆ వానరుని దండింప పొమ్మనెను |
జంబుమాలి ప్రహస్తుని సుతుడు
హనుమంతుని పై దాడి వెడలెను | ౨౧౬ | శ్రీ హనుమాను |

జంబుమాలిని సర్వ సైన్యమును
వొక్క వానరుడు ఉక్కడగించెను |
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను | ౨౧౭ |

మంత్రికుమారుల తగిన బలము గొని
ఆ వానరుని దండింపగ పొమ్మనె |
మంత్రికుమారులు యేడ్గురు చేరి
హనుమంతునిపై దాడి వెడలిరి | ౨౧౮ |

మంత్రిసుతులను సర్వ సైన్యమును
మారుతి తృటిలో సంహరించెను |
యెటు చూచినను మృత దేహములు
యెటు పోయినను రక్తపుటేరులు | ౨౧౯ |

ఈ వృత్తాంతము వినిన రావణుడు
కొంత తడవు యోచించి పల్కెను |
సేనాపతులను తగిన బలము గొని
ఆ వానరుని దండింప పొమ్మనెను | ౨౨౦ |

సేనాపతులను సర్వ సైన్యమును
పవనకుమారుడు నిర్మూలించెను |
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిశ్చేష్టితుడై పరివీక్షించెను | ౨౨౧ |

తండ్రిచూపులు తనపై సోకగ
అక్ష కుమారుడు ఇటవుగ నిలువగ |
రావణుండు పల్కె కుమారుని గని
ఆ వానరుని దండింప పొమ్మని | ౨౨౨ | శ్రీ హనుమాను |

అక్షకుమారుడు నవ యవ్వనుడు
వేగవంతుడు తేజోవంతుడు |
దివ్యాస్త్రములను పొందినవాడు
మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు | ౨౨౩ |

కాలాగ్ని వోలె ప్రజ్వరిల్లెడు
రణధీరుడు మహావీరుడు |
అక్షకుమారుడు దివ్య రథము పై
దాడి వెడలెను హనుమంతుని పై | ౨౨౪ |

మూడు శరములతో మారుతి శిరమును
పది శరములతో మారుతి ఉరమును |
అక్షకుమారుడు బలముగ నాటెను
రక్తము చిందగ గాయ పరచెను | ౨౨౫ |

ఉదయ భాస్కర సమాన తేజమున
మారుతి యెగసె గగన మార్గమున |
యిరువురి నడుమ భీకరమైన
పోరు చెలరేగె ఆకాశమున | ౨౨౬ |

అతి నేర్పు తోడ రణము సల్పెడు
అక్షకుమారుని మారుతి దయగొని |
బాలుని చంపగ చేతులు రావని
వేచిచూచెను నిగ్రహించుకొని | ౨౨౭ |

అక్షకుమారుడు అంతకంతకును
అగ్నిహోత్రుడై రణమున రేగెను |
యిరువురి నడుమ భికరమైన
పోరు చెలరేగె ఆకాశమున | ౨౨౮ |

అగ్ని కణమని జాలి కూడదని
రగులక మునుపే ఆర్పుట మేలని |
సింహనాదమును మారుతి చేసెను
అరచేత చరచి హయముల జంపెను | ౨౨౯ |

రధమును బట్టి విరిచి వేసెను
అక్షుని ద్రుంచి విసరి వేసెను |
అక్షుని మొండెము అతి ఘోరముగ
నేలపై బడె రక్తపు ముద్దగ | ౨౩౦ |

అక్ష కుమారుని మరణ వార్త విని
లంకేశ్వరుడు కడు దుఃఖించెను |
మెల్లగ తేరి క్రోధము బూని
తన కుమారుని ఇంద్రజిత్తు గని | ౨౩౧ |

ఆ వానరుడు సామాన్యుడు గాడని
వానిని వేగ బంధించి తెమ్మని |
రావణాసురుడు ఇంద్రజిత్తును
హనుమంతుని పై దాడి పంపెను | ౨౩౨ |

కపికుంజరుడు భయంకరముగ
కాయము పెంచి సమరము సేయగ |
ఈ వానరుడు సామాన్యుడు గాడని
మహిమోపేతుడు కామరూపుడని | ౨౩౩ |

ఇంద్రజిత్తు బహుయోచన చేసి
బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసె |
దేవ గణంబులు సంగ్రామము గని
తహతహలాడిరి యేమగునోయని | ౨౩౪ |

బ్రహ్మాస్త్రము చే బంధింపబడి
పవనకుమారుడు నేలపై బడె |
వనజభవుడు తనకు వొసగిన వరము
స్మరియించుకొని ప్రార్థన చేసె | ౨౩౫ |

వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల
కాపాడుమని ధ్యానము చేసె |
దేవ గణంబులు సంగ్రామము గని
తహతహలాడిరి యేమగునోయని | ౨౩౬ |

కట్టుపడియున్న వానరోత్తముని
అసురులు తలచిరి తమకు లొంగెనని |
త్వరత్వరగా దానవులు దరి చేరి
నారచీరెలతో బిగి బంధించిరి | ౨౩౭ |

బ్రహ్మ వరమున బ్రహ్మాస్త్ర బంధము
క్షణకాలములో తొలగి పోయెను |
మారుతి మాత్రము నారచీరెలకె
కట్టుపడినటుల కదలక యుండె | ౨౩౮ |

వానరోత్తముని దూషణలాడుచు
రావణు కడకు యీడ్చుకు పోవగ |
ఈ వానరుని వధించివేయుడని
మన యెడ ద్రోహము చేసినాడని | ౨౩౯ |

రక్తనేత్రముల నిప్పులు రాలగ
లంకేశ్వరుడు గర్జన సేయగ |
రావణు తమ్ముడు విభీషణుడు
దూతను చంపుట తగదని తెల్పెను | ౨౪౦ | శ్రీ హనుమాను |

అన్నా రావణా ! తెలిసినవాడవు
శాంతముగా నా మనవిని వినుమా |
దూతను జంపుట ధర్మము గానిది
లోకముచే గర్హింపబడునది | ౨౪౧ |

శూరుడవైన నీకు తగనిది
రాజధర్మ విరుద్ధమైనది |
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెల్పెను | ౨౪౨ |

అన్నా ! వీనిని వధింపకుమా
తగు రీతిని దండించి పంపుమా |
దూత యెడల విధింపబడినవి
వధ గాక తగిన దండనలున్నవి | ౨౪౩ |

తల గొరిగించుట, చబుకు వేయుట,
గురుతు వేయుట, వికలాంగు సేయుట |
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెల్పెను | ౨౪౪ | శ్రీ హనుమాను |

కపులకు వాలము ప్రియ భూషణము
కావున కాల్చుడు వీని వాలము |
వాడ వాడల వూరేగింపుడు
పరాభవించి వదలివేయుడు | ౨౪౫ |

కాలిన తోకతో వీడేగు గాక !
అంపిన వారికి తలవొంపు గాక !
అని రావణుడు విభీషణుని గని
ఆజ్ఞాపించెను కోపమణచుకొని | ౨౪౬ |

జీర్ణాంబరములు అసురులు దెచ్చిరి
వాయుకుమారుని తోకకు జుట్టిరి |
నూనెతో తడిపి నిప్పంటించిరి
మంటలు మండగ సంతసించిరి | ౨౪౭ |

కపికుంజరుని యీడ్చుకు పోయిరి
నడి వీధులలో వూరేగించిరి |
మారుతి మాత్రము మిన్నకుండెను
సమయము కాదని సాగిపోయెను | ౨౪౮ |

కపిని బంధించి తోక గాల్చిరని
నడి వీధులలో త్రిప్పుచుండిరని |
రాక్షస వనితలు వేడుక మీరగ
పరుగున పోయి సీతకు తెలుపగ | ౨౪౯ |

అంతటి ఆపద తన మూలమున
వాయుసుతునకు వాటిల్లెనని |
సీతా మాత కడు చింతించెను
అగ్ని దేవుని ప్రార్థన చేసెను | ౨౫౦ |

ఓర్వరానివై మండిన మంటలు
ఒక్కసారిగా చల్లగ దోచెను |
అగ్ని దేవునకు, నా జనకునకు
అన్యోన్యమైన మైత్రిచేతనో | ౨౫౧ |

రామ దూతనై వచ్చుట చేతనో
సీతా మాత మహిమ చేతనో |
మండే జ్వాలలు పిల్లగాలులై
వీవసాగెనని మారుతి పొంగెను | ౨౫౨ |

ఆనందముతో కాయము పెంచెను
బంధములన్నీ తెగిపడిపోయెను |
అడ్డగించిన అసురులందరని
అరచేత చరచి అట్టడగించెను | ౨౫౩ |

గిరిశిఖరము వలె యెత్తుగ నున్న
నగర ద్వార గోపురమందున |
స్తంభము పైకి మారుతి యెగసెను
లంకాపురమును పరివీక్షించెను | ౨౫౪ | శ్రీ హనుమాను |

యే మంటల నా వాలము గాల్చిరో
ఆ మంటలనే లంక గాల్తునని |
భీమ రూపుడై గర్జన సేయుచు
రుద్ర రూపుడై మంటల జిమ్ముచు | ౨౫౫ |

మేడ మిద్దెల వనాల భవనాల
వెలిగించెను జ్వాలా తోరణాల |
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించె మారుతి | ౨౫౬ |

ఒకచో కుంకుమ కుసుమ కాంతుల
ఒకయెడ బూరుగు పుష్పఛాయల |
ఒకచో మోదుగు విరుల తేజముల
ఒకయెడ కరగిన లోహపు వెలుగుల | ౨౫౭ |

కోటి సూర్య సమాన కాంతుల
లంకాపురము రగిలెను మంటల |
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించె మారుతి | ౨౫౮ | శ్రీ హనుమాను |

హనుమంతుడు సముద్ర జలాల
చల్లార్చుకొనే లాంగూల జ్వాల |
తలచిన కార్యము నెరవేర్చితినని
తేరిపార జూచె వెనుకకు తిరిగి | ౨౫౯ |

కనుపించెను ఘోరాతిఘోరము
జ్వాలాభీలము లంకాపురము |
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోపమె తన శత్రువాయెనని | ౨౬౦ |

సీతామాత క్షేమము మరచితి
కోపతాపమున లంక దహించితి |
లంకా పురము సర్వము పోగా
ఇంకా జానకి మిగిలియుండునా ?౨౬౧ |

సిగ్గు మాలిన స్వామి ద్రోహిని
సీతను చంపిన మహాపాపినని |
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోసమె తన శత్రువాయెనని | ౨౬౨ |

సీత లేనిదె రాముడుండడు
రాముడు లేనిదె లక్ష్మణుడుండడు |
భరత శత్రుఘ్న సుగ్రీవాదులు
ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు | ౨౬౩ |

ఈ ఘోరమునకు కారణమైతిని
నాకు మరణమే శరణ్యమని |
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోపమే తన శత్రువాయెనని | ౨౬౪ |

శ్రీరఘురాముని ప్రియసతి సీత
అగ్ని వంటి మహా పతివ్రత |
అగ్నిని అగ్ని దహింపనేర్చునా ?
అయోనిజను అగ్ని దహించునా ?౨౬౫ |

నను కరుణించిన అగ్ని దేవుడు
సీతను చల్లగ చూడకుండునా ?
అని హనుమంతుడు తలచుచుండగా
శుభ శకునములు తోచె ప్రీతిగా | ౨౬౬ |

యెల్ల రాక్షసుల సిరి సంపదలు
మంటల పాలై దహనమాయెనని |
అశోక వనము ధ్వంసమైనను
జానకి మాత్రము క్షేమమేనని | ౨౬౭ |

లంకాపురము రూపుమాసినను
విభీషణు గృహము నిలిచి యుండెనని |
అంబర వీధిని సిద్ధచారణులు
పలుకగా విని మారుతి పొంగెను | ౨౬౮ | శ్రీ హనుమాను |

అశోక వనము మారుతి చేరెను
ఆనందాశ్రుల సీతను గాంచెను |
తల్లీ ! నీవు నా భాగ్యవశమున
క్షేమముంటివని పదముల వ్రాలెను | ౨౬౯ |

పోయి వత్తునిక సెలవునిమ్మని
అంజలి ఘటించి చెంత నిలచెను |
సీతా మాత హనుమంతునితో
ప్రీతిగ పలికెను ఆనందముతో | ౨౭౦ |

హనుమా ! అతులిత బలధామా !
శత్రుకర్శణా ! శాంతినిదానా !
యిందుండి నన్ను యీ క్షణమందే
కొనిపోగల సమర్థుడవీవే | ౨౭౧ |

రాముని వేగమె తోడ్కొని రమ్ము
రాక్షస చెర నాకు తొలిగింపుము |
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో | ౨౭౨ |

తల్లీ ! నిన్ను చూచినదాదిగ
త్వరపడుచుంటిని మరలిపోవగా |
భీతినొందకుము నెమ్మదినుండుము
త్వరలో నీకు శుభములు కలుగు | ౨౭౩ |

రామలక్ష్మణ సుగ్రీవాదులను
అతి శీఘ్రముగా కొనిరాగలను |
అని మారుతి సీత పదముల వ్రాలె
సెలవుగైకొని రివ్వున మరలె | ౨౭౪ | శ్రీ హనుమాను |

అరిష్టమను గిరిపై నిలిచి
మారుతి యెగసెను కాయము పెంచి |
పవనకుమారుని పదఘట్టనకే
పర్వతమంతయు పుడమిని కృంగె | ౨౭౫ |

సీతను గాంచిన శుభవార్త వేగ
శ్రీరామునకు తెలియచేయగ |
మారుతి మరలెను అతి వేగముగ
ఉత్తర దిశగా వారిధి దాటగ | ౨౭౬ |

గరుడుని వోలె శరవేగము గొని
పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని |
మార్గ మధ్యమున మైనాకుని గని
ప్రేమ మీరగా క్షేమము కనుగొని | ౨౭౭ |

దూరము నుండి మహేంద్ర శిఖరిని
ఉత్సాహమున ముందుగా గని |
విజయ సూచనగ గర్జన సేయుచు
మారుతి సాగెను వేగము పెంచుచు | ౨౭౮ |

సుందరమైన మహేంద్రగిరి పైన
సెలయేట దిగి తానమాడి |
జాంబవదాది పెద్దలందరికి
వాయునందనుడు వందనములిడి | ౨౭౯ |

చూచితి సీతను ! చూచితి సీతను !
అను శుభవార్తను ముందుగ పలికెను |
కపి వీరులు హనుమంతుని బొగడిరి
ఉత్సాహమున కిష్కింధకు సాగిరి | ౨౮౦ |

జాంబవదంగద హనుమదాదులు
ప్రస్రవణగిరి చేరుకొనినారు |
రామ లక్ష్మణ సుగ్రీవాదులకు
వినయముతో వందనమిడినారు | ౨౮౧ |

ఆంజనేయుడు శ్రీరామునితో
చూచితి సీతనని శుభవార్త తెల్పె |
చూడామణిని శ్రీరామునకిడి
అంజలి ఘటించి చెంతన నిలచె | ౨౮౨ | శ్రీ హనుమాను |

చూడామణిని రాముడు గైకొని
తన హృదయానికి చేర్చి హత్తుకొని |
మాటలు రాని ఆనందముతో
అశ్రులు నిండిన నయనాలతో | ౨౮౩ |

హనుమా ! సీతను యెట్లు గాంచితివి
యెట్లున్నది సీత, యేమి తెల్పినది ?
అని పలికిన శ్రీరామచంద్రునకు
మారుతి తెల్పె తన లంకా యానము | ౨౮౪ |

శత యోజనముల వారిధి దాటి
లంకాపురమున సీతను గాంచితి |
రాలు కరుగగా సీత పలుకగ
నా గుండెల క్రోధాగ్ని రగులగ | ౨౮౫ |

అసురుల గూల్చితి లంక దహించితి
రావణునితో సంవాదము సల్పితి |
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను | ౨౮౬ |

నిరతము నిన్నే తలచుచున్నది
క్షణమొక యుగముగ గడుపుచున్నది |
రెండు నెలల గడువు తీరక మునుపే
వేగమె వచ్చి కాపాడుమన్నది | ౨౮౭ |

రామలక్ష్మణ సుగ్రీవాదులకు
సీత క్షేమమని తెలుపమన్నది |
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను | ౨౮౮ |

రామలక్ష్మణుల భుజముల నిడుకొని
వేగమె లంకకు గొని వత్తునని |
రామలక్ష్మణుల అగ్ని శరములకు
రావణాదులు కూలుట నిజమని | ౨౮౯ |

యెన్నో రీతుల సీతా మాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని |
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను | ౨౯౦ |

అందరు కలసి అయోధ్యకు చేరి
ఆనందముగా సుఖించెదరని |
సీతారామ పట్టాభిషేకము
కనుల పండువుగ జరిగి తీరునని | ౨౯౧ |

యెన్నో రీతుల సీతా మాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని |
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను | ౨౯౨ |

ఆనందముతో అశ్రులు జారగ
సీతామాత నను దీవించగ |
పదముల వ్రాలి నే పయనమైతిని
పదములు రాక నే మరలి వచ్చితిని | ౨౯౩ |

ఒప్పలేదు కాని యెపుడో తల్లిని
భుజముల నిడుకొని కొనిరాకుందునా ?
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను | ౨౯౪ | శ్రీ హనుమాను |

సీత క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు తెలుపకుండిన |
నేటి తోడ మా రఘుకులమంతా
అంతరించి యుండెడిది కదా ! ౨౯౫ |

మమ్మీ తీరుగ ఉద్ధరించిన
మారుతికి యేమివ్వగలనని |
సర్వమిదేనని కౌగిట జేర్చెను
హనుమంతుని ఆజానుబాహుడు | ౨౯౬ | శ్రీ హనుమాను |

నలుగురు శ్రద్ధతో ఆలకించగ
నలుగురు భక్తితో ఆలపించగ |
సీతారామహనుమానులు సాక్షిగ
సర్వజనులకు శుభములు కలుగగ | ౨౯౭ |

కవి కోకిల వాల్మీకి పలికిన
రామాయణమును తేట తెలుగున |
శ్రీ గురు చరణా సేవా భాగ్యమున
పలికెద సీతారామ కథ | ౨౯౮ | శ్రీ హనుమాను |

మంగళ హారతి గొను హనుమంతా
సీతారామ లక్ష్మణ సమేతా
నా అంతరాత్మ నిలుమో అనంతా
నీవే అంతా శ్రీ హనుమంతా |

Sundaradasu Sundarakanda Part 2 | Sri MS Rama Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top