విశ్వదాభిరామ వినుర వేమ అంటూ ముగిసే వేమన పద్యాలు చదవని తెలుగు వారు ఉండరు. చదువురాని పామరులకు కూడా అర్థమయ్యేలా పద్యాలు రాసిన మహనీయుడాయన. లోకంలోని ఎన్నో విషయాలను తన పద్యాల ద్వారా చెప్పాడు. వేమన సృశించని అంశం లేదు. లోతైన భావాలను సైతం సులభమైన వాడుక భాషలో చెప్పగల దిట్ట. అందుకే వేమన జనం మెచ్చిన కవి అయ్యాడు. ఇతని పద్యాలన్నీ ఆటవెలదిలోనే ఉంటాయి. ఆటవెలది అనేది తెలుగులో ఒక పద్యరీతి. అందుకే వేమనను ఆటవెలదిని ఈటెగా విసిరిన దిట్ట అని లోకం మెచ్చుకుంది.
వేమన ప్రతి పద్యంలోని నాలుగో పాదంలో విశ్వదాభిరామ వినుర వేమ అని ఉంటుంది. ఇందులో విశ్వద అనే పేరు అతని వదినదని, అభిరాముడు అనే పేరు అతని స్నేహితుడిదని కథనాలు ఉన్నాయి. వారిద్దరే అతని మార్గాన్ని సంస్కరించిన వ్యక్తులని, అందుకే వీళ్ళ పేర్లని శాశ్వతంగా అంతా తలుచుకునేట్టు గా చెయ్యాలనే తలంపుతో ఇలా రాశాడని అంటారు.
సరళమైన చిన్న మాటలతో ఎంతో విలువైన జీవిత సత్యాలని చెప్పారు వేమన. బ్రౌన్ దొర వీటిని మెచ్చి, ఇంగీష్ భాషలోకి తర్జుమా చేసి రాసారు. అంత గొప్పవేమన పద్యాలు మన సంపద. పిల్లలకి ఇవి నేర్పగలిగితే, వారి బుద్ది చక్కగా వికసిస్తుంది. మామ్ జంక్షన్ ఇక్కడ అటువంటి చక్కని వేమన శతకం నుండి కొన్ని పద్యాలను మీ ముందుంచాలని ప్రయత్నిస్తోంది. పిల్లలకి వీటిని నేర్పి వారి వ్యక్తిత్వాన్నితీర్చి దిద్దండి.
Vemana Telugu Padyalu / 30 వేమన పద్యాలు:
- అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!
అర్ధం:
ఓ వేమా! నీచుడైన వాడు ఎప్పుడూ ఆడంబరములు, గొప్పలు చెప్పును. మంచివాడు నెమ్మదిగా శాంతస్వభావుడై మాట్లాడును అదెట్లనగా , విలువలో తక్కువైనా కంచు గట్టిగా మోగును ,కానీ విలువైన బంగారం మ్రోగదు కదా? కావున మంచివాడెప్పుడూ అణుకువతో ఉంటాడు.
- ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా
అర్ధం :
ఓ వేమా! ఉప్పు, కర్పూరం చూచుటకు ఒకే మాదిరి కనపడతాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి. చూడటానికి అందరూ మనుషులొక్కమాదిరి గా కనిపించినా, పుణ్య పురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు. వారిని గుర్తించగలగాలి. అదే విజ్ఞత.
- అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన !
విశ్వదాభి రామ వినురవేమ!
అర్ధం:
ఓ వేమా! పాడగా పాడగా పాట మధురంగా నుండును. చేదుగా ఉండే వేప కూడా తినగా తినగా తీపిగా ఉందును. అట్లే ఈ భూమిపై ప్రయత్నంతో ఎటువంటి పనులనైనా సాధించగలం.
- తప్పులెన్ను వారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగారు
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
వేమా! ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇతరుల్లో తప్పులు ఎంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చెయ్యటం మానవ సహజం .
- తల్లి దండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా ?గిట్టవా?
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
తల్లిదండ్రులపైన దయతో ఉండాలి. వృద్ధాప్యంలో వారిని దయతో ప్రేమతో ఆదరించాలి. అలా చేయని కొడుకు ఉన్నా లేనట్టే. అలంటి వాడు పుట్టలోనే పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం.
- మేడి పండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు,
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభి రామ వినురవేమ!
అర్ధం:
మేడి పండు పైకి చక్కగా నిగనిగలాడుతూ కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉంది. అలాగే పిరికి వాడు పైకి ధైర్యం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది.
- వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ!
అర్ధం:
మహా వృక్షము కూడా వేరుకు పురుగుపడితే చచ్చిపోతుంది. చెట్టుకు చీడ పడితే ఆ చెట్టు నాశనమై పోతుంది. అలాగే చెడ్డవాడి వలన ఎంత మంచి వాడైనా చెడిపోతాడని అర్ధము. కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు.
- చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో !
విశ్వదాభి రామ వినుర వేమా!
అర్ధం:
ఓ వేమా! మంచి మనసుతో చేసిన పుణ్యం కొంచెమైనను భగవంతుని దృష్టిలో విశేషమైనది. మర్రి విత్తనము చాలా చిన్నదైనా , అది పెరిగి , మహా వృక్షము కాదా?
- ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా ?
విశ్వదాభి రామ వినురవేమ!
అర్ధం:
మనసు నిర్మలముగా లేకుండా ఆచారములు, పూజలు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థమే. ఏ ప్రయోజనముండదు.
- గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు !
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
ఓ వేమా! శ్రేష్టమైన ఆవు పాలు ఒక్క గరిటెడైనను విలువైనవే .గాడిద పాలు కుండనిండుగా ఉన్ననూ ఉపయోగము ఏమియు లేదుకదా! కావున భక్తి తో పెట్టిన భోజనము పట్టెడైనా తృప్తి నిచ్చును.
- అనువు కానీ చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
స్థాన బలము లేని చోట గొప్పవారమని విర్రవీగ రాదు .ఇతరులకంటే తక్కువగానుండుట తప్పు కాదు . అది నీచము కాదు. అదెట్లనగా, కొండ అద్దములో చిన్నదిగా కనిపించుట మామూలే అంతమాత్రమున కొండ చిన్నదవ్వదు కదా? కావున తక్కువ వారమని కించపరుచుకోరాదు .
- ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి అతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేగాని మరియంట నేర్చునా !
విశ్వదాభి రామ వినురవేమ!
అర్ధం: ఇనుము విరిగినచో , ఎర్రగా కాల్చి మళ్లీ అతికేలా చేయవచ్చు. అదే మనసు విరిగిపోతే తిరిగి కలపటం అసాధ్యం. అందుకే ఎవ్వరి మనసు నొప్పించకూడదు.
- చెప్పులోనిరాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమా!
అర్ధం:
చెప్పులోని రాయి, కంటిలోను నలుసు, కాలిలో దిగిన ముల్లు, ఇంటిలోని గొడవ చాలా బాధిస్తాయని అర్థము.
- ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపే కానీ తెలుపు కాదు
కొయ్యబొమ్మతెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభి రామ వినురవేమ !
అర్ధం:
ఎలుక తోలు తెచ్చి ఎంతకాలము ఉతికిననూ దాని నలుపు పోయి తెలుపు రాదు. అట్లే జీవం లేని చెక్కతో చేసిన బొమ్మను ఎంత కొట్టినా పలుకదు కదా?
- అల్పజాతివానికి కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
జెప్పుతినెడి కుక్క చెరకు తీపెఱుగునా
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
అల్పబుద్ధి గల దుష్టునికి అధికారమిచ్చినచో మంచి వారిని తొలగించి తనవారిని నియమించును. చెప్పు తినే కుక్కకి చెరకు తీపి తెలియదు కదా.
- కులములోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
ఒక్క గంధపు చెట్టు వలన అరణ్యమునంతకు సువాసన వచినట్లు , ఒక్క గుణవంతుని వలన వంశమునకంతకు మంచిపేరు వచ్చును.
- చంపదగిన యట్టి శత్రువు తన చేత
జిక్కెనేగాని కీడుసేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
చంపాలనుకున్న శత్రువు చేతికి చిక్కినచో , వానికి అపకారము చేయకూడదు. ఉపకారము చేసి పొమ్మని వదిలి వేయుట మంచిది. వాడు అవమానంతో , పశ్చాత్తాపము పడి, మంచి వానిగా మారే అవకాశమున్నది.
- ధనము కూడబెట్టి దానంబు చేయక
తానుదినక లెస్స దాచుకొనగ
తేనెటీగగూర్చి తెరువరికియ్యదా
విశ్వదాభి రామ వినురవేమ !
అర్ధం:
ఓ వేమా! ధనమును బాగా సంపాదించి , దానధర్మములు చేయక, తానూ తినక,దాచుకొనుట అన్నది ఎటువంటిదంటే, తేనెటీగ కష్టపడి సంపాదించిన తేనె దారినపోయే బాటసారుల పాల్జేసిన విధముగా నుండును.
- ఆలి మాటలు వినియన్నదమ్ముల బాసి
వేరె పోవువాడు వెఱ్ఱివాడు
కుక్క తోకబట్టి గోదావరీదునా !
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
భార్య మాటలు నమ్మి, తోడబుట్టిన వారిని వదిలి వేరు కాపురం పెట్టేవాడు వెర్రివాడు. కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదడం సాధ్యాం కాదు కదా.
- కల్లలాడు వాని గ్రామకర్త యెరుగు
సత్యమాడువాని స్వామియెరుగు
బెద్దతిండిపోతు బెండ్లామెరుంగురా
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
అబద్ధము చెప్పువారిని గ్రామపెద్ద గుర్తించగలడు, సత్యము చెప్పువానిని దేవుడు గుర్తించగలడు . తిండిబోతైన భర్తని భార్య కాక మరెవరు గుర్తించును?
- చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్క కరచి బాధ చేయు
బలిమి లేని వేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ
అర్ధం:
అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా కరిచి బాధపెడుతుంది. అందుకే బలము లేని చోట పంతాలకు పోరాదు .
- కానీ వాని తోడ గలసి మెలగుచున్న
గానివానివలె కాంతురతని
తాడిక్రింద బాలుత్రాగిన చందమౌ
విశ్వదాభి రామ వినుర వేమ
అర్ధం:
తాటిచెట్టు కింద కూర్చుని పాలు తాగినా, కల్లుతాగినట్టే భావిస్తారంతా. అదే తీరుగా చెడ్డవానితో కలిసి తిరుగుతుంటే, వారిని కూడా చెడ్డ వారిగానే చూస్తుంది లోకం.
- వేష భాషలెరిగి కాషాయవస్త్రముల్
కట్టగానే ముక్తి కలుగబోదు
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ
అర్ధం:
తగినట్లుగా వేష భాషలుండి సంస్కారవంతులైనా,సర్వము తెలిసినవారైనా ,కాషాయ రంగు బట్టలు కట్టినా ముక్తి కలుగదు . తల పై నున్న వెంట్రుకలు తీయించుకున్నంత మాత్రముచేత మనసులోని కోరికలు నశిస్తాయా ? నశించవు. సర్వసంగ పరిత్యాగియే ముక్తికి అర్హుడు .
- వంపుకర్ర కాల్చి వంపు దీర్పగవచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తుని మనసు కరిగింపగ రాదు
విశ్వదాభిరామ వినుర వేమ
అర్ధం:
వంకరగా ఉన్న కర్రని కాల్చి దాని వంపుని తిసేయవచ్చును, కొండల్ని పిండిగా కొట్టచ్చు ,కానీ కఠినాత్ముని మనసుని మాత్రం కరిగించలేము .
- విద్య లేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండు కాడు
కొలని హంసలకడ కొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ
అర్ధం: చదువు లేనివాడు పండితుల దగ్గరగా మెలిగినంత మాత్రాన పండితుడు కాజాలడు . ఎట్లాగంటే, కొంగ కొలనులో విహరిస్తున్న హంసల పక్కన ఉన్నంత మాత్రాన కొంగ హంస కాలేదు.
- పెట్టిపోయలేని వట్టినరులు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁజెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
అర్ధం:
దాన ధర్మాలు చేయని, ఎవరికీ ఉపయోగపడని మనుషులు పుట్టినా ,చచ్చినా ఒకటే. పుట్టలో కుప్పలు తెప్పలుగా చెద పురుగులు పుడుతూ మరణిస్తున్నాయి కదా.
- ఆపదల వేళ బంధులరసిజూడు
భయము వేళ చూడు బంటుతనము
పేదవేళ చూడు పెండ్లాము గుణమును
విశ్వదాభి రామ వినుర వేమ
అర్ధం:
కష్ట కాలంలో బంధువులను పరీక్షించి చూడు, వారి నైజం అప్పుడు బయట పడుతుంది . భయం కలిగేవేళ సేవకులు లేక సైనికులను పరీక్షించి చూడు .అప్పుడు బయటపడుతుంది వాళ్ళు ఎంత ధైర్యవంతులో .పేదరికంలో భార్య గుణమును చూడు, భర్త పై ఆమెకు గల ప్రేమ ఎంతో బయట పడుతుంది .
- ఉప్పులేని కూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పులేనివాడే అధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమ
అర్ధం:
ఉప్పు లేని కూర రుచికరంగా ఉండదు .పప్పులేని భోజనం వల్ల బలం రాదు . ఈ భూమిలో అప్పు లేనివాడే గొప్ప ధనవంతుడు .
- లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పురము
పిల్ల కోతి ఫౌజు కొల్లగొట్టె
జేటు కాలమయిన జెరుప నల్పులేచాలు
విశ్వదాభిరామ వినురవేమ
అర్ధం: లక్ష్మీ నిలయమైన లంకాపతి రావణుని లంకను కేవలం కోతులు అంతం చేసెను . చెడు కాలం దాపురిస్తే అల్పులు సహితం అపకారం చేస్తారు .
- చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తి కలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమ
అర్ధం: స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమవుతుంది . నీటిలోపడిన చినుకు నీటిలో కలసి పోతుంది. ప్రాప్తం ఉండాలే గాని లాభం వచ్చే చోట రాకుండా మానదు.