Templesinindiainfo

Best Spiritual Website

Sri Kalahastiswara Satakam Lyrics in Telugu

Sri Kalahasteeswara Satakam in Telugu:

శ్రీవిద్యుత్కలితా‌உజవంజవమహా-జీమూతపాపాంబుధా-
రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ |
దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా-
సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! || 1 ||

వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క
ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! || 2 ||

అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ
చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా! || 3 ||

నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ
గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే
జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 4 ||

భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న
న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ
ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా! || 5 ||

స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే
నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో
యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా! || 6 ||

దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా
నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం
డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ
చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 7 ||
నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం
బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా
చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే
రీతిన్నాకిఁక నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 8 ||

ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! || 9 ||

నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్
తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్
చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా! || 10 ||

వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ
గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్
పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా! || 11 ||

నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
కొననీ ఙ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా! || 12 ||

ఏ వేదంబు బఠించె లూత భుజంగం బేశాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి చెంచేమంత్ర మూహించె బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీపాదసం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 13 ||

కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్
రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే
బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ
జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా! || 14 ||

నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా! || 15 ||

నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో
నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే
సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా! || 16 ||

ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ
జాలన్ జంపంగ నేత్రము ందివియంగాశక్తుండనేఁ గాను నా
శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా! || 17 ||

రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం
భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా
బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ ఙ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా! || 18 ||

నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో
రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్!
నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా! || 19 ||

నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ
జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా
బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ
జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా! || 20 ||

రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే
యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ
ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా! || 21 ||

రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా
నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ
రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 22 ||

తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్
సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్
సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 23 ||

నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య
ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా! || 24 ||

నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్
క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా
శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ
జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! || 25 ||

నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్
నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న
న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ
జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా! || 26 ||

అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం
జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 27 ||

కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 28 ||

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర
త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే?
దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే
సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 29 ||

అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై
యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 30 ||

మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే?
మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా
చి దినంబుల్ వృధపుత్తురఙ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా! || 31 ||

రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్
పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్
కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా! || 32 ||

ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్
నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా
కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం?
జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా! || 33 ||

చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న
న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో
ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా
జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 34 ||

దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా
ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా! || 35 ||

ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త
ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా
మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ
సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా! || 36 ||

తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే
సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా! || 37 ||

పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న
య్యుదయాస్తాచలసంధి నాఙ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా! || 38 ||

రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్
సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు
ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా! || 39 ||

మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా
రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! || 40 ||

పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా-
టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్
భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి-
చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా! || 41 ||

అమరస్త్రీల రమించినం జెడదు మోహం బింతయున్ బ్రహ్మప-
ట్టము సిధ్ధించిన నాస దీఱదు నిరూఢక్రోధమున్ సర్వలో-
కముల న్మ్రింగిన మాన దిందుఁ గల సౌ-ఖ్యం బొల్ల నీసేవఁ జే-
సి మహాపాతకవారిరాశిఁ గడతున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 42 ||

చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే
మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్
మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ
జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా! || 43 ||

భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే
భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు
ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ
ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా! || 44 ||

పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా! || 45 ||

లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో
లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్
సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 46 ||

మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే
సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ
జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా! || 47 ||

తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ
పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా! || 48 ||

మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం
డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా
జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా
సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 49 ||

జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం
జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 50 ||

ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ
బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం
జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో
చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 51 ||

పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం
టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా! || 52 ||

కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా
దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా! || 53 ||

తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్
గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో
పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం
జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా! || 54 ||

ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే
వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం
గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా! || 55 ||

సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న
న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం
గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ
జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా! || 56 ||
కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం
బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై
తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా
సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా! || 57 ||

శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్
మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం
చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని
ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా! || 58 ||

గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా! || 59 ||

రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో
నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు
గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల
స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా! || 60 ||

అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే
యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 61 ||

సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్
శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్
శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా! || 62 ||

స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ
బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్
బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా
రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! || 63 ||

అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా
రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా
రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 64 ||

ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ
మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి
హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో
రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా! || 65 ||

శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము
త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ
ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా
రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా! || 66 ||

ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే
లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి
త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా
రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా! || 67 ||

నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం
డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్
జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 68 ||

ఙ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్
మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ
బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా
చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 69 ||

చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా
మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం
జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా! || 70 ||

రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ
బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్
మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ
జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా! || 71 ||

శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో
కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో
నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా! || 72 ||

అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్
దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని
ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 73 ||

మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ)
జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో
యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో
శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 74 ||

చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం
ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక
వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు
చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా! || 75 ||

వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్
వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్
నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం
జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 76 ||

పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో
గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో
దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు
స్థిరవిఙ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా! || 77 ||

మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు
ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న
వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే
సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 78 ||

కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో
వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో
దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో
ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా! || 79 ||

ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో
పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా
నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా! || 80 ||

కేదారాదిసమస్తతీర్ధములు కోర్మింజూడఁ బోనేఁటికిన్
గాడా ముంగిలి వారణాసి! కడుపే కైలాసశైలంబు మీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నఙ్ఞానల
క్ష్మీదారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీ కాళహస్తీశ్వరా! || 81 ||

తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై
చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా! || 82 ||

వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే
లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు
ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం
జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా! || 83 ||

పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం
బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం
గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం
జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా! || 84 ||

విత్తఙ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురమ్ ఐనృతముల్ మాఱాకు లత్యంతదు
ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం
జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 85 ||

నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి
మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని
ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ
చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా! || 86 ||

సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్
దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం
జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం
జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా! || 87 ||

రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో
యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా
జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 88 ||

నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా
పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే
కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 89 ||

నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్
నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే
ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా! || 90 ||

ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్
దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్
వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల
క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 91 ||

ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో
చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః
పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో
చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 92 ||

దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్
నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం
తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని
ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 93 ||

ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా! || 94 ||

నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా
లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా
దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాండరములోఁ గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా! || 95 ||

మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా
’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న
న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా! || 96 ||

కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా
లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది
క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 97 ||

పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా
మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా
నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ
చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 98 ||

తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో
భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత
వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ
జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా! || 99 ||

జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి
ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి
ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ
శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా! || 100 ||

చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా
ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్
వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో
రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా! || 101 ||

భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో
వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం
తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 102 ||

జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే!
వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా!
నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా! || 103 ||

గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో
కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ
బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్
చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా! || 104 ||

క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా
తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా
పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా! || 105 ||

సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని
శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ
నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ
చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా! || 106 ||

తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా
విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్
సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా
రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 107 ||

పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ
ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా
క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్
చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 108 ||

నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో
చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం
బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా! || 109 ||

కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ
శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో
పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే
సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 110 ||

దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్
నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్
సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 111 ||

తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి
ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే
ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే
సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! || 112 ||

క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా
నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్
ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం
గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా! || 113 ||

నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ
ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా! || 114 ||

నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై
రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ
భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై
చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా! || 115 ||

దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా! || 116 ||

Also Read:

Sri Kalahastiswara Satakam lyrics in Hindi | English | Bengali | Kannada | Malayalam | Telugu | Tamil

Sri Kalahastiswara Satakam Lyrics in Telugu

4 thoughts on “Sri Kalahastiswara Satakam Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top