Templesinindiainfo

Best Spiritual Website

Sundaradasu Sundarakanda Part 1 | Sri MS Rama Rao

Sundaradasu (Sri MS Rama Rao) Sundarakanda Part 1:

[ ప్రథమ భాగం/Part 1 – ద్వితీయ భాగం/Part 2 ]
॥ సుందరదాసు సుందరకాండ (ప్రథమ భాగం) ॥
(కృతజ్ఞతలు: కీ|శే| సుందరదాసు శ్రీ ఎం|ఎస్|రామారావు గారికి, శ్రీ పి|శ్రీనివాస్ గారికి)

శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ |

శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు
అతి బలవంతుడు రామభక్తుడు |
లంకకు పోయి రాగల ధీరుడు
మహిమోపేతుడు శత్రుకర్శనుడు | ౧ |

జాంబవదాది వీరులందరును
ప్రేరేపింపగ సమ్మతించెను |
లంకేశ్వరుడు అపహరించిన
జానకీమాత జాడ తెలిసికొన | ౨ |

తన తండ్రి యైన వాయుదేవునకు
సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు |
వానరేంద్రుడు మహేంద్రగిరి పై
వందనములిడె పూర్వాభిముఖుడై | ౩ |

రామనామమున పరవశుడయ్యె
రోమరోమమున పులకితుడయ్యె |
కాయము పెంచె కుప్పించి యెగసె
దక్షిణ దిశగా లంక చేరగా | ౪ |

పవనతనయుని పదఘట్టనకే
పర్వతరాజము గడగడ వణకె |
ఫలపుష్పాదులు జలజల రాలె
పరిమళాలు గిరిశిఖరాలు నిండె | ౫ |

పగిలిన శిలల ధాతువులెగసె
రత్నకాంతులు నలుదిశల మెరసె |
గుహలను దాగిన భూతములదిరి
దీనారవముల పరుగిడె బెదిరి | ౬ | శ్రీ హనుమాను |

రఘుకులోత్తముని రామచంద్రుని
పురుషోత్తముని పావన చరితుని |
నమ్మిన బంటుని అనిలాత్మజుని
శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని | ౭ |

నీ కడ కొంత విశ్రాంతి దీసికొని
పూజలందుకొని పోవచ్చునని |
సగర ప్రవర్థితుడు సాగరుడెంతో
ముదమున పలికె మైనాకునితో | ౮ |

మైనాకుడు ఉన్నతుడై నిలిచె
హనుమంతుడు ఆగ్రహమున గాంచె |
ఇదియొక విఘ్నము కాబోలునని
వారిథి బడద్రోసె ఉరముచే గిరిని | ౯ |

పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగె
పవనతనయుని బలము గని పొంగె |
తిరిగి నిలిచె హనుమంతుని పిలిచె
తన శిఖరముపై నరుని రూపమై | ౧౦ | శ్రీ హనుమాను |

వానరోత్తమా ఒకసారి నిలుమా
నా శిఖరాల శ్రమ దీర్చుకొనుమా |
కందమూలములు ఫలములు తినుమా
నా పూజలు గొని మన్ననలందుమా | ౧౧ |

శత యోజనముల పరిమితముగల
జలనిధినవలీల దాటిపోగల |
నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు
నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు | ౧౨ |

పర్వతోత్తముని కరమున నిమిరి
పవనతనయుడు పలికెను ప్రీతిని |
ఓ గిరీంద్రమా సంతసించితిని
నీ సత్కారము ప్రీతినందితిని | ౧౩ |

రామకార్యమై యేగుచుంటిని
సాధించువరకు ఆగనంటిని |
నే పోవలె క్షణమెంతో విలువలే
నీ దీవెనలే నాకు బలములే | ౧౪ | శ్రీ హనుమాను |

అనాయాసముగ అంబరవీధిని
పయనము జేసెడు పవనకుమారుని |
ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు
పులకాంకితులై ప్రస్తుతించిరి | ౧౫ |

రామకార్యమతి సాహసమ్మని
రాక్షసబలమతి భయంకరమని |
కపివరుడెంతటి ఘనతరుడోయని
పరిశీలనగా పంపిరి సురసను | ౧౬ |

ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని
వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని |
అతిగా సురస నోటిని దెరచె
హనుమంతుడలిగి కాయము బెంచె | ౧౭ |

ఒకరినొకరు మించి కాయము బెంచిరి
శత యోజనములు విస్తరించిరి |
పై నుండి సురలు తహతహలాడిరి
ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి | ౧౮ |

సురస ముఖము విశాలమౌట గని
సూక్ష్మబుద్ధి గొని సమయమిదేనని |
క్షణములోన అంగుష్ఠమాతృడై
ముఖము జొచ్చి వెలివచ్చె విజయుడై | ౧౯ |

పవనకుమారుని సాహసము గని
దీవించె సురస నిజరూపము గొని |
నిరాలంబ నీలాంబరము గనుచు
మారుతి సాగెను వేగము పెంచుచు | ౨౦ |

జలనిధి తేలే మారుతి ఛాయను
రాక్షసి సింహిక అట్టె గ్రహించెను |
గుహను బోలు తన నోటిని దెరచెను
కపివరుని గుంజి మ్రింగజూచెను | ౨౧ |

అంతట మారుతి సూక్ష్మరూపమున
సింహిక ముఖమును చొచ్చి చీల్చెను |
సింహిక హృదయము చీలికలాయెను
సాగరమున బడి అసువులు బాసెను | ౨౨ |

వారిథి దాటెను వాయుకుమారుడు
లంక చేరెను కార్యశూరుడు |
నలువంకలను కలయజూచుచు
నిజ రూపమున మెల్లగ సాగుచు | ౨౩ |

త్రికూటాచల శిఖరముపైన
విశ్వకర్మ వినిర్మితమైన |
స్వర్గపురముతో సమానమైన
లంకాపురమును మారుతి గాంచెను | ౨౪ | శ్రీ హనుమాను |

అనిలకుమారుడా రాత్రివేళను
సూక్ష్మరూపుడై బయలుదేరెను |
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనులబడకను | ౨౫ |

పిల్లివలె పొంచి మెల్లగ సాగెను
ఉత్తర ప్రాకార ద్వారము జేరెను |
లంకారాక్షసి కపివరు గాంచెను
గర్జన సేయుచు అడ్డగించెను | ౨౬ |

కొండ కోనల తిరుగాడు కోతివి
ఈ పురికి యే పనికై వచ్చితివి ?
లంకేశ్వరుని ఆనతి మేర
లంకాపురికి కావలి యున్నా | ౨౭ |

లంకను నేను లంకాధిదేవతను
నీ ప్రాణములను నిలువున దీతును |
కదలక మెదలక నిజము పల్కుమని
లంక యెదుర్కొనె కపి కిశోరుని | ౨౮ |

అతి సుందరమీ లంకాపురమని
ముచ్చటపడి నే చూడవచ్చితిని |
ఈ మాత్రమునకు కోపమెందుకులే
పురము గాంచి నే మరలిపోదులే | ౨౯ |

అని నెమ్మదిగా పలుకగా విని
అనిలాత్మజుని చులకనగాగొని
లంకా రాక్షసి కపికిశోరుని
గర్జించి కసరి గద్దించి చరచెను | ౩౦ |

సింహనాదమును మారుతి జేసె
కొండంతగ తన కాయము బెంచె |
వామ హస్తమున పిడికిలి బిగించె
ఒకే పోటున లంకను గూల్చె | ౩౧ |

కొండ బండలా రక్కసి దొల్లె
కనులప్పగించి నోటిని దెరచె |
అబలను చంపుట ధర్మము గాదని
లంకను విడిచె మారుతి దయగొని | ౩౨ |

ఓ బలభీమా ! వానరోత్తమా !
నేటికి నీచే ఓటమెరిగితి |
ఈ నా ఓటమి లంకకు చేటని
పూర్వమే బ్రహ్మ వరమొసగెనని | ౩౩ |

రావణుడాదిగ రాక్షసులందరు
సీతమూలమున అంతమొందెదరు |
ఇది నిజమౌనని మీదే జయమని
లంకారాక్షసి పంపె హరేశుని | ౩౪ | శ్రీ హనుమాను |

కోటగోడ అవలీలగ ప్రాకెను
కపికిశోరుడు లోనికి దుమికెను |
శత్రుపతనముగ వామపాదమును
ముందుగ మోపెను ముందుకు సాగెను | ౩౫ |

ఆణిముత్యముల తోరణాలు గల
రమ్యతరమైన రాజవీధుల |
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను | ౩౬ |

సువర్ణమయ సౌధరాజముల
ధగధగ మెరసే ఉన్నత గృహముల |
కళకళలాడే నవ్వుల జల్లులు
మంగళకరమౌ నృత్యగీతములు | ౩౭ |

అప్సరసల మరపించు మదవతుల
త్రిస్థాయి బలుకు గానమాధురులు |
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను | ౩౮ |

సుందరమైన హేమ మందిరము
రత్నఖచితమౌ సింహద్వారము |
పతాకాంకిత ధ్వజాకీర్ణము
నవరత్నకాంతి సంకీర్ణము | ౩౯ |

నృత్య మృదంగ గంభీర నాదితము
వీణాగాన వినోద సంకులము |
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను | ౪౦ |

అత్తరు పన్నీట జలకములు
కాలాగరు సుగంధ ధూపములు |
స్వర్ణ ఛత్రములు వింజామరలు
కస్తూరి పునుకు జవాది గంధములు | ౪౧ |

నిత్య పూజలు శివార్చనలు
మాస పర్వముల హోమములు |
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను | ౪౨ | శ్రీ హనుమాను |

యమకుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వసంపదల మించినది |
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది
బ్రహ్మవరమున కుబేరుడందినది | ౪౩ |

రావణుండు కుబేరుని రణమందు
ఓడించి లంకకు గొని తెచ్చినది |
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె | ౪౪ |

నేలను తాకక నిలచియుండునది
రావణ భవన మధ్యంబుననున్నది |
వాయుపథమున ప్రతిష్ఠితమైనది
మనమున దలచిన ప్రీతిపోగలది | ౪౫ |

దివినుండి భువికి దిగిన స్వర్గమది
సూర్యచంద్రులను ధిక్కరించునది |
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె | ౪౬ |

లంకాధీశుని ప్రేమ మందిరము
రత్నఖచితమౌ హేమ మందిరము |
చందనాది సుగంధ బంధురము
పానభక్ష్య పదార్థ సమృద్ధము | ౪౭ |

ఆయా పరిమళ రూపానిలము
అనిలాత్మజుచే ఆఘ్రాణితము |
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె | ౪౮ |

మత్తున శయనించు సుదతుల మోములు
పద్మములనుకొని మూగు భ్రమరములు |
నిమీలిత విశాల నేత్రములు
నిశాముకుళిత పద్మపత్రములు | ౪౯ |

ఉత్తమ కాంతల గూడి రావణుడు
తారాపతి వలె తేజరిల్లెడు |
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె | ౫౦ |

రావణుండు రణమందున గెలిచి
స్త్రీలెందరినో లంకకు జేర్చెను |
పితృ దైత్య గంధర్వ కన్యలు
ఎందెందరో రాజర్షి కన్యలు | ౫౧ |

సీత తక్క వారందరు కన్యలె
రావణుమెచ్చి వరించిన వారలె |
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె | ౫౨ | శ్రీ హనుమాను |

ఐరావతము దంతపు మొనలతో
పోరున బొడిచిన గంటులతో |
వజ్రాయుధపు ప్రఘాతములతో
చక్రాయుధపు ప్రహరణములతో | ౫౩ |

జయపరంపరల గురుతులతో
కీర్తి చిహ్నముల కాంతులతో |
లంకేశుడు శయనించె కాంతలతో
సీతకై వెదకె మారుతి ఆశతో | ౫౪ |

మినప రాశి వలె నల్లని వాడు
తీక్షణ దృక్కుల లోహితాక్షుడు |
రక్తచందన చర్చిత గాత్రుడు
సంధ్యారుణ ఘన తేజోవంతుడు | ౫౫ |

సతులగూడి మధు గ్రోలిన వాడు
రతికేళి సలిపి సోలిన వాడు |
లంకేశుడు శయనించె కాంతలతో
సీతకై వెదకె మారుతి ఆశతో | ౫౬ |

అందొక వంక పర్యంకము జేరి
నిదురించుచుండె దివ్యమనోహరి |
నవరత్నఖచిత భూషణధారిణి
నలువంకలను కాంతి ప్రసారిణి | ౫౭ |

స్వర్ణదేహిని చారురూపిణి
రాణులకు రాణి పట్టపురాణి |
లంకేశ్వరుని హృదయేశ్వరి
మందోదరి లోకోత్తర సుందరి | ౫౮ |

మందోదరిని జానకి యనుకొని
ఆడుచు పాడుచు గంతులు పెట్టి |
వాలము బట్టి ముద్దులు పెట్టి
నేలను గొట్టి భుజములు తట్టి | ౫౯ |

స్తంభములెగసి క్రిందకు దుమికి
పల్లటీలు గొట్టి ఛెంగున జుట్టి |
చంచలమౌ కపిస్వభావమును
పవనతనయుడు ప్రదర్శన జేసెను | ౬౦ | శ్రీ హనుమాను |

రాముని సీతా యిటులుండునా ?
రావణు జేరి శయనించునా ?
రాముని బాసి నిదురించునా ?
భుజయించునా భూషణముల దాల్చునా ? ౬౧ |

పరమపురుషుని రాముని మరచునా ?
పరపురుషునితో కాపురముండునా ?
సీత కాదు కాదు కానేకాదని
మారుతి వగచుచు వెదకసాగెను | ౬౨ |

పోవగరాని తావుల బోతి
చూడగరానివి యెన్నో జూచితి |
నగ్నముగా పరున్న పరకాంతల
పరిశీలనగా పరికించితిని | ౬౩ |

రతికేళి సలిపి సోలిన రమణుల
ఎందెందరినో పొడగాంచితిని |
ధర్మము గానని పాపినైతినని
పరితాపముతో మారుతి కృంగెను | ౬౪ |

సుదతుల తోడ సీతయుండగా
వారల జూడక వెదకుటెలాగ ?
మనసున యేమి వికారమునొందక
నిష్కామముగ వివేకము వీడక | ౬౫ |

సీతను వెదకుచు చూచితి గాని
మనసున యేమీ పాపమెరుగనని |
స్వామి సేవ పరమార్థముగా గొని
మారుతి సాగెను సీత కోసమని | ౬౬ |

భూమీగృహములు నిశాగృహములు
క్రీడాగృహములు లతాగృహములు |
ఆరామములు చిత్రశాలలు
బావులు తిన్నెలు రచ్చవీధులు | ౬౭ |

మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్లు
సందులు గొందులు బాటలు తోటలు |
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు
సీతను గానక మారుతి వగచె | ౬౮ |

సీతామాత బ్రతికి యుండునో
కౄర రాక్షసుల పాల్పడి యుండునో ?
తాను పొందని సీత యెందుకని
రావణుడే హతమార్చి యుండునో ? | ౬౯ |

అని యోచించుచు అంతట వెదకుచు
తిరిగిన తావుల తిరిగి తిరుగుచు |
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు
సీతను గానక మారుతి వగచె | ౭౦ |

సీత జాడ కనలేదను వార్తను
తెలిపిన రాముడు బ్రతుకజాలడు |
రాముడు లేనిదె లక్ష్మణుడుండడు
ఆపై రఘుకులమంతయు నిశించు | ౭౧ |

ఇంతటి ఘోరము కాంచినంతనె
సుగ్రీవాదులు మడియక మానరు |
అని చింతించుచు పుష్పకము వీడి
మారుతి చేరె ప్రాకారము పైకి | ౭౨ |

ఇంత వినాశము నా వల్లనేను
నే కిష్కింధకు పోనే పోను |
వానప్రస్థాశ్రమవాసుడనై
నియమ నిష్ఠలతో బ్రతుకువాడనై | ౭౩ |

సీతామాతను చూచితీరెదను
లేకున్న నేను అగ్ని దూకెదను |
అని హనుమంతుడు కృత నిశ్చయుడై
నలుదెసల గనె సాహసవంతుడై | ౭౪ |

చూడ మరచిన అశోక వనమును
చూపు మేరలో మారుతి గాంచెను |
సీతారామ లక్ష్మణాదులకు
ఏకాదశ రుద్రాది దేవులకు | ౭౫ |

ఇంద్రాది యమ వాయుదేవులకు
సూర్యచంద్ర మరుద్గణములకు |
వాయునందనుడు వందనములిడి
అశోకవని చేరెను వడివడి | ౭౬ | శ్రీ హనుమాను |

విరితేనియలు గ్రోలు భృంగములు
విందారగ సేయు ఝంకారములు |
లేజివురాకుల నెసవు కోయిలలు
పంచమ స్వరముల పలికే పాటలు | ౭౭ |

పురులు విప్పి నాట్యమాడు నెమళులు
కిలకిలలాడే పక్షుల గుంపులు |
సుందరమైన అశోకవనమున
మారుతి వెదకెను సీతను కనుగొన | ౭౮ |

కపికిశోరుడు కొమ్మకొమ్మను
ఊపుచు ఊగుచు దూకసాగెను |
పూవులు రాలెను తీవెలు తెగెను
ఆకులు కొమ్మలు నేలపై బడెను | ౭౯ |

పూలు పై రాల పవనకుమారుడు
పుష్పరథము వలె వనమున దోచెడు |
సుందరమైన అశోకవనమున
మారుతి వెదకెను సీతను కనుగొన | ౮౦ |

పూవులనిన పూతీవియలనిన
జానకికెంతో మనసౌనని |
పద్మపత్రముల పద్మాక్షుని గన
పద్మాకరముల కొంతె జేరునని | ౮౧ |

అన్ని రీతులా అనువైనదని
అశోకవని సీత యుండునని |
శోభిల్లు శింశుపా తరుశాఖలపై
మారుతి కూర్చొని కలయజూచెను | ౮౨ | శ్రీ హనుమాను |

సుందరమైన అశోకవనమున
తను కూర్చొనిన తరువు క్రిందున |
కృంగి కృశించిన సన్నగిల్లిన
శుక్లపక్షపు చంద్రరేఖను | ౮౩ |

ఉపవాసముల వాడిపోయిన
నివురు గప్పిన నిప్పు కణమును |
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున | ౮౪ |

మాసిన పీతవసనమును దాల్చిన
మన్నున పుట్టిన పద్మమును |
పతి వియోగ శోకాగ్ని వేగిన
అంగారక పీడిత రోహిణిని | ౮౫ |

మాటిమాటికి వేడి నిట్టూర్పుల
సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను |
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున | ౮౬ |

నీలవేణి సంచాలిత జఘనను
సుప్రతిష్టను సింహమధ్యను |
కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను
రతీదేవి వలె వెలయు కాంతను | ౮౭ |

పుణ్యము తరిగి దివి నుండి జారి
శోక జలధి పడి మునిగిన తారను |
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున | ౮౮ |

పతి చెంతలేని సతికేలనని
సీత సొమ్ముల దగిల్చె శాఖల |
మణిమయ కాంచన కర్ణవేష్ఠములు
మరకత మాణిక్య చంపసరాలు | ౮౯ |

రత్నఖచితమౌ హస్త భూషలు
నవరత్నాంకిత మణిహారములు |
రాముడు దెలిపిన గురుతులు గలిగిన
ఆభరణముల గుర్తించె మారుతి | ౯౦ |

సర్వ సులక్షణ లక్షిత జాత
సీతగాక మరి యెవరీ మాత ?
కౌసల్యా సుప్రజారాముని
సీతగాక మరి యెవరీ మాత ? ౯౧ |

వనమున తపించు మేఘశ్యాముని
సీతగాక మరి యెవరీ మాత ?
ఆహా కంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి | ౯౨ | శ్రీ హనుమాను |

పూవులు నిండిన పొలములందున
నాగేటిచాలున జననమందిన |
జనక మహారాజు కూతురైన
దశరథ నరపాలు కోడలైన | ౯౩ |

సీతాలక్ష్మికి కాదు సమానము
త్రైలోక్యరాజ్య లక్ష్మీ సహితము |
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని | ౯౪ |

శత్రుతాపకరుడు మహాశూరుడు
సౌమిత్రికి పూజ్యురాలైన |
ఆశ్రితజన సంరక్షుడైన
శ్రీరఘురాముని ప్రియసతి యైన | ౯౫ |

పతి సన్నిధియే సుఖమనియెంచి
పదునాల్గేండ్లు వనమునకేగిన |
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని | ౯౬ |

బంగరు మేని కాంతులు మెరయ
మందస్మిత ముఖ పద్మము విరియ |
హంసతూలికా తల్పమందున
రాముని గూడి సుఖింపగ తగిన | ౯౭ |

పురుషోత్తముని పావనచరితుని
శ్రీరఘురాముని ప్రియసతి యైన |
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని | ౯౮ | శ్రీ హనుమాను |

మూడు ఝాముల రేయి గడువగా
నాల్గవ ఝాము నడచుచుండగా |
మంగళవాద్య మనోహర ధ్వనులు
లంకేశ్వరుని మేలుకొలుపులు | ౯౯ |

క్రతువులొనర్చు షడంగవేదవిదుల
స్వరయుగ శబ్దతరంగ ఘోషలు |
శోభిల్లు శింశుపా శాఖలందున
మారుతి కూర్చొని ఆలకించెను | ౧౦౦ |

రావణాసురుడు శాస్త్రోక్తముగా
వేకువనే విధులన్ని యొనర్చెను |
మదోత్కటుడై మదనతాపమున
మరిమరి సీతను మదిలో నెంచెను | ౧౦౧ |

నూర్గురు భార్యలు సురకన్యల వలె
పరిసేవింపగ దేవేంద్రుని వలె |
దశకంఠుడు దేదీప్యమానముగ
వెడలెను అశోకావనము చేరగా | ౧౦౨ |

లంకేశునితో వెడలిరి సతులు
మేఘము వెంట విద్యుల్లతల వలె |
మధువు గ్రోలిన పద్మముఖుల
ముంగురులు రేగె భృంగముల వలె | ౧౦౩ |

క్రీడల తేలిన కామినీమణుల
నిద్రలేమి పడు అడుగులు తూలె |
దశకంఠుడు దేదీప్యమానముగ
చేరెను అశోకావనము వేగముగ | ౧౦౪ |

లంకేశుని మహా తేజమును గని
మారుతి కూడ విభ్రాంతి జెందెను |
దశకంఠుడు సమీపించి నిలిచెను
సీతపైననే చూపులు నిలిపెను | ౧౦౫ |

తొడలు చేర్చుకొని కడుపును దాచి
కరములు ముడిచి చనుగన దాచి
సుడిగాలి పడిన కదళీ తరువు వలె
కటిక నేలపై జానకి తూలె | ౧౦౬ | శ్రీ హనుమాను |

ఓ సీతా ! ఓ పద్మనేత్రా !
నా చెంత నీకు యేల చింత ?
ఎక్కడి రాముడు ? ఎక్కడి అయోధ్య ?
ఎందుకోసమీ వనవాస వ్యథ ? ౧౦౭ |

నవయవ్వన త్రిలోకసుందరీ
నీకెందుకు యీ మునివేషధారి ?
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె | ౧౦౮ |

రాముడు నీకు సరిగానివాడు
నిను సుఖపెట్టడు తను సుఖపడడు |
గతిచెడి వనమున తిరుగుచుండెనో
తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో | ౧౦౯ |

మరచిపొమ్ము ఆ కొరగాని రాముని
వలచి రమ్ము నను యశోవిశాలుని |
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె | ౧౧౦ |

రాముడు వచ్చుట నన్ను గెల్చుట
నిన్ను పొందుట కలలోని మాట |
బలవిక్రమ ధన యశములందున
అల్పుడు రాముడు నా ముందెందున | ౧౧౧ |

యమ కుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నాకిల నరభయమేల ?
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె | ౧౧౨ | శ్రీ హనుమాను |

నిరతము పతినే మనమున దలచుచు
క్షణమొక యుగముగ కాలము గడుపుచు |
రావణ గర్వమదంబుల ద్రుంచు
రాముని శౌర్యధైర్యముల దలచుచు | ౧౧౩ |

శోకతప్తయై శిరమును వంచి
తృణమును ద్రుంచి తన ముందుంచి |
మారు పల్కె సీత దీనస్వరమున
తృణముకన్న రావణుడే హీనమన | ౧౧౪ |

రామలక్ష్మణులు లేని సమయమున
అపహరించితివె నను ఆశ్రమమున |
పురుష సింహముల గాలికి బెదిరి
పారిపోతివి శునకము మాదిరి | ౧౧౫ |

యమ కుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నీకీ వంచనలేల ?
అని పల్కె సీత దీన స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన | ౧౧౬ |

ఓయి రావణా ! నా మాట వినుము
శ్రీరామునితో వైరము మానుము |
శీఘ్రముగా నను రాముని జేర్చుము
త్రికరణ శుద్ధిగా శరణు వేడుము | ౧౧౭ |

నిను మన్నించి అనుగ్రహింపుమని
కోరుకొందు నా కరుణామూర్తిని |
అని పల్కె సీత దీన స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన | ౧౧౮ | శ్రీ హనుమాను |

ఓ సీతా ! నీవెంత గడసరివె
ఎవరితో యేమి పల్కుచుంటివె ?
ఎంతటి కర్ణ కఠోర వచనములు
ఎంతటి ఘోర అసభ్య దూషణలు | ౧౧౯ |

నీపై మోహము నను బంధించెను
లేకున్న నిను వధించియుందును |
అని గర్జించెను ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై దశకంఠుడు | ౧౨౦ |

నీకొసగిన ఏడాది గడువును
రెండు నెలలలో తీరిపోవును |
అంతదనుక నిన్నంటగ రాను
ఈలోపున బాగోగులు కనుగొను | ౧౨౧ |

నను కోరని నిను బలాత్కరించను
నను కాదను నిను కనికరించను |
అని గర్జించెను ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై దశకంఠుడు | ౧౨౨ |

ఓ రావణా ! నీ క్రొవ్విన నాలుక
గిజగిజలాడి తెగిపడదేమి ?
కామాంధుడా నీ కౄర నేత్రములు
గిర గిర తిరిగి రాలిపడవేమి ?౧౨౩ |

పతియాజ్ఞ లేక యిటులుంటి గాని
తృటిలో నిన్ను దహింపనా యేమి ?
అని పల్కె సీత దివ్య స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన | ౧౨౪ |

క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు
కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు |
తన కాంతలెల్ల కలవరమొందగ
గర్జన సేయుచు దిక్కులదరగ | ౧౨౫ |

సీతనెటులైన వొప్పించుడని
వొప్పుకొననిచో భక్షించుడని |
రావణాసురుడు అసురవనితలను
ఆజ్ఞాపించి మరలిపోయెను | ౧౨౬ | శ్రీ హనుమాను |

అందున్న వొక వృద్ధ రాక్షసి
తోటి రాక్షసుల ఆవల ద్రోసి |
కావలెనన్న నన్ను వేధింపుడు
సీతను మాత్రము హింసింపకుడు | ౧౨౭ |

దారుణమైన కలగంటి నేను
దానవులకది ప్రళయమ్మేను |
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము | ౧౨౮ |

శుక్లాంబరములు దాల్చినవారు
రామలక్ష్మణులు అగుపించినారు |
వైదేహికి యిరువంకల నిలచి
దివ్యతేజమున వెలుగొందినారు | ౧౨౯ |

తెల్లని కరిపై మువ్వురు కలసి
లంకాపురిపై పయనించినారు |
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము | ౧౩౦ |

దేవతలందరు పరిసేవింప
ఋషిగణంబులు అభిషేకింప |
గంధర్వాదులు సంకీర్తింప
బ్రహ్మాదులు మునుముందును దింప | ౧౩౧ |

సీతారాముడు విష్ణుదేవుడై
శోభిల్లెను కోటి సూర్య తేజుడై |
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము | ౧౩౨ |

తైలమలదుకొని రావణాసురుడు
నూనె త్రాగుచూ అగుపించినాడు |
కాలాంబరమును ధరియించినాడు
కరవీరమాల దాల్చినాడు | ౧౩౩ |

పుష్పకమందుండి నేలబడినాడు
కడకొక స్త్రీచే యీడ్వబడినాడు |
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము | ౧౩౪ | శ్రీ హనుమాను |

రావణుండు వరాహముపైన
కుంభకర్ణుడు ఒంటెపైన |
ఇంద్రజిత్తు మకరముపైన
దక్షిణ దిశగా పడిపోయినారు | ౧౩౫ |

రాక్షసులందరు గుంపుగుంపులుగ
మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ |
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము | ౧౩౬ |

తెల్లని మాలలు వలువలు దాల్చి
తెల్లని గంధము మేన బూసికొని |
నృత్య మృదంగ మంగళ ధ్వనులతో
చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో | ౧౩౭ |

తెల్లని కరిపై మంత్రివర్యులతో
వెడలె విభీషణుడు దివ్యకాంతితో |
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము | ౧౩౮ |

విశ్వకర్మ నిర్మించిన లంకను
రావణుండు పాలించెడు లంకను |
రామదూత వొక వానరోత్తముడు
రుద్రరూపుడై దహియించినాడు | ౧౩౯ |

ప్రళయ భయానక సదృశమాయెను
సాగరమున లంక మునిగిపోయెను |
అని పల్కు త్రిజట మాటలు వినుచు
నిద్రతూగిరి రాక్షస వనితలు | ౧౪౦ |

హృదయ తాపమున జానకి తూలుచు
శోకభారమున గడగడ వణకుచు |
జరిగి జరిగి అశోక శాఖలను
ఊతగాగొని మెల్లగ నిలచి | ౧౪౧ |

శ్రీరాముని కడసారి తలచుకొని
తన మెడజడతో వురిపోసుకొని |
ప్రాణత్యాగము చేయబూనగా
శుభ శకునములు తోచె వింతగా | ౧౪౨ |

సీతకెంత దురవస్థ ఘటిల్లె
నా తల్లినెటుల ఊరడించవలె ?
నన్ను నేనెటుల తెలుపుకోవలె
తల్లినెటుల కాపాడుకోవలె ?౧౪౩ |

యే మాత్రము నే ఆలసించినా
సీతామాత ప్రాణములుండునా ?
అని హనుమంతుడు శాఖలమాటున
తహతహలాడుచు మెదలసాగెను | ౧౪౪ |

నను గని జానకి బెదరక ముందే
పలికెద సీతారామ కథ |
సత్యమైనది వ్యర్థము గానిది
పావనమైనది శుభకరమైనది | ౧౪౫ |

సీతా మాతకు కడు ప్రియమైనది
పలుకు పలుకున తేనెలొలుకునది |
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ | ౧౪౬ |

దశరథ విభుడు రాజోత్తముడు
యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు |
దశరథునకు కడు ప్రియమైన వాడు
జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు | ౧౪౭ |

సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు
పితృవాక్య పరిపాలన శీలుడు |
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ | ౧౪౮ |

శ్రీ రాముని పట్టాభిషేకము
నిర్ణయమైన శుభసమయమున |
చిన్న భార్య కైక దశరథు చేరి
తనకొసగిన రెండు వరములు కోరె | ౧౪౯ |

భరతునకు పట్టాభిషేకము
పదునాల్గేండ్లు రామ వనవాసము |
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ | ౧౫౦ | శ్రీ హనుమాను |

Sundaradasu Sundarakanda Part 1 | Sri MS Rama Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top