Templesinindiainfo

Best Spiritual Website

Sakalendriyamulara Lyrics in Telugu | Ramadasu Keerthana

॥ Sakalendriyamulara Telugu Lyrics ॥

కాంభోజి – జంపె 

పల్లవి:
సకలేంద్రియములార సమయముగాదు సద్దుచేయక యిపుడుండరే మీరు
ప్రకటముగ మాయింటను జానకీపతిపూజ యను పండుగాయెను మీరు స ॥

చరణము(లు):
నిరతమును పదునాలుగుభువనములు కుక్షిలోనుంచుకొని నిర్వహించెడి స్వామికి
ఇరవుగ నా హృదయకమలకర్ణిక మధ్యమున భక్తినుంచికొనియు
శరణాగతత్రాణ బిరుదుగల్గిన తండ్రి నను కరుణింపుమనివేడుచు
నరసింహదేవునకు నేను పంచామృతస్నాన మొనరింపచేయువేళ స ॥

తళుకు తళుకున ముద్దు గులుకు జిగికుందనపు నిలువుటంగి దొడిగి నే
నలరు ఘుమఘుమ పరిమళించే వనమాలికాహారములు మెడను వేసి
లలితకౌస్తుభ దివ్యరత్నాల చొక్కపుతాళి మెడలోవేసియు
అల దయాపరవిగ్రహునకు భుజకీర్తులనిడి యవి సవరించువేళ మీరు స ॥

పదియారువన్నె బంగరుశాలువ దట్టికట్టి విదియచంద్రుని గేరు
నుదుట కస్తురి నామమునుదిద్ది తామరలవంటి మృదుపదములందు
కదిసి మువ్వలు పాదసరము లందెలు ఘల్లుఘల్లుమన పొంకముగా నుంచియు
కదిసి వడ్యాణములు మొలనూలు ఘంటలు హరికినలంకరించువేళ మీరు స ॥

కౌమోదకీ శంఖచక్రనందక శార్ఙ్గకార్ముకాంచిత కరముల
శ్రీమించు కనకంపు హురు మంచిముత్యాల చికిలి కడియములనమర్చి
ప్రేమ చక్కవ్రేళ్ళ ముద్దుటుంగరములను ప్రియమొప్ప వీనులయందున
మా మనోహరునకు వజ్రముల కర్ణకుండలము లమరించువేళ మీరు స ॥

శిరమునను శతకోటి సూర్యులనుమించు భాసురకిరీటమును ధరింపజేసి
హరిపాదకమలములను మంచి స్వర్ణకుసుమముల పూజచేసి అ
గరు ధూపదీపనైవేద్యతాంబూలాది సకలోపచార మొసగి
సరసభద్రాద్రీశునకు రామదాసుడు సాష్టాంగ మొనరించువేళ మీరు స ॥

Sakalendriyamulara Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top